తెలుగు సినీ రంగంలోని పెద్దల కళ్లలో ఇటీవల కాలంలో లేనంత ఆనందం కనిపించింది. పైరసీ భూతంగా మారి.. సినీ రంగానికి సవాల్ విసిరిన ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు, సైబర్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. దీంతో తెలుగు ఇండస్ట్రీ పెద్దలు ఆనందానికి లోనయ్యారు. ఈ క్రమంలో తాజాగా సోమవారం ఉదయం హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సజ్జనార్‌తో చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు తదితరులు భేటీ అయి.. కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు తమ ఆనందాన్ని పంచుకున్నారు. వేల కోట్ల రూపాయల పరిశ్రమ.. పైరసీ భూతానికి అల్లాడి పోయిందని.. పోలీసులు చొరవ తీసుకుని.. రవిని అరెస్టు చేయడంతో తమ కష్టాలు తగ్గాయని పేర్కొన్నారు. “దమ్ముంటే పట్టుకోండి అని పోలీసులకు సవాల్ విసిరాడు. ఇమ్మడి రవి ఇప్పుడెక్కడున్నాడు..? హైదరాబాద్ పోలీసులను అంత తక్కువగా అంచనా వేయొద్దు. పోలీసులను, ప్రభుత్వాన్ని సవాల్ చేస్తే ఏమవుతుందో మీకు తెలుసు. ప్రజలు ఇలాంటి సైట్ల జోలికి పోవద్దు. సపోర్ట్ చేయొద్దు.. మీకు నష్టం జరుగుతుంది“ అని ప్రజలకు సజ్జనార్ సూచించారు.
ఇక, చిరంజీవి మాట్లాడుతూ.. “ఎంతోమంది కష్టాన్ని ఉచితంగా దోచుకోవడం సబబు కాదు. సినిమా రంగం ఎన్నో కష్టనష్టాలకోర్చి చిత్రాలు తీస్తోంది. చాలా ఏళ్లుగా పైరసీ బాధించింది. సినిమాను నమ్ముకుని వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. పైరసీ కట్టడికి పోలీసులు ఎంతో శ్రమించారు.. గత సీపీ సీవీ ఆనంద్, ప్రస్తుత సీపీ సజ్జనార్ పైరసీ భూతాన్ని పట్టుకున్నారు. తెలంగాణ పోలీసులకు ధన్యవాదాలు“ అని తెలిపారు. రాజమౌళి, నాగార్జున సహా సినీ పెద్దలు సీపీకి కృతజ్ఞతలు చెప్పారు.