చిన్న సినిమాలకు ప్రమోషన్లు చాలా కీలకం. కాకపోతే దానికి సరిపడా బడ్జెట్ అందరి దగ్గరా ఉండదు. ఏదో ఒక వైరల్ కంటెంట్ క్రియేట్ చేయనిదే ఆడియన్స్ దృష్టిలో పడలేం. లిటిల్ హార్ట్స్ సక్సెస్ వెనుక మంచి పబ్లిసిటీ క్యాంపైన్ ఉంది. బన్నీ వాస్ తో మొదలుపెట్టి విజయ్ దేవరకొండ దాకా అందరూ అండగా నిలవబట్టి పెద్ద స్థాయి విజయం అందుకుంది. ఇవి లేకనే ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మంచి టాక్, రివ్యూలు తెచ్చుకుని మరీ థియేట్రికల్ ఫెయిల్యూర్ అయ్యింది. వీటి సంగతి పక్కనపెడితే త్వరలో విడుదల కాబోతున్న ఒక చిన్న సినిమాకు బాక్సాఫీస్ వద్ద టఫ్ కాంపిటీషన్ ఉంది. దీన్నెలా ఎదురుకోవాలో అర్థం కాలేదు.
దీంతో క్లైమాక్స్ కు సంబంధించిన ఒక ముఖ్యమైన లీకుని బయటికి వదిలారు. హీరో పాత్రకు సంబంధించి షాకింగ్ అనిపించే ఆ ట్విస్ట్ చూసి యూత్ షాక్ అయిపోయి కొందరు దీనికోసమైనా చూడాలని ఫిక్స్ అవ్వగా, మరికొందరు ఎమోషన్ పేరుతో మరీ ఇంత రిస్క్ చేయడం భావ్యం కానీ నెగటివ్ కామెంట్స్ ఇస్తున్నారు. ఆ సినిమా ఏదీ, ఏంటా మలుపు అనే దాని కన్నా అసలు ఇది ఎలా బయటికి వచ్చిందనేది పెద్ద ప్రశ్న. కానీ ఇదంతా ఇప్పుడా టీమ్ కు చేస్తున్న మేలే ఎక్కువ. పాజిటివో నెగటివో ఏదో ఒకటి సోషల్ మీడియా జనాల మధ్య టాపిక్ గా మారిపోయింది. ఇదే ఓపెనింగ్స్ తెచ్చినా ఆశ్చర్యం లేదు.
ఈ స్ట్రాటజీనే మైనస్ అయ్యే ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే చివర్లో ఏం జరుగుతుందో ముందే తెలిసిపోతే థ్రిల్ తో పాటు సదరు ఎమోషన్ కూడా తగ్గిపోతుంది. అదే జరిగితే ఆడియన్స్ నుంచి బయటికి వచ్చే టాక్ లో మార్పు రావొచ్చు. సరే రిస్క్ తీసుకుని ఇన్ఫో వదిలారు అది ఎలాంటి ఫలితం ఇస్తుందో తేలాలంటే ఇంకొద్ది రోజులు ఆగాలి. అయినా లీకులతో సినిమాలను చంపేస్తున్నారని ఒకపక్క సీనియర్ నిర్మాతలు గగ్గోలు పెడుతుంటే చిన్న ప్రొడ్యూసర్లు అచ్చం దానికి రివర్స్ లో లీకులు తాముగా ఇచ్చేస్తున్నారు. సరే ఎవరి మార్కెటింగ్ వారిది. ఎవరినీ రాంగ్ అనలేం. ఫైనల్ తీర్పు జనాలదే.