hyderabadupdates.com movies హైదరాబాద్‌లో ఐమ్యాక్స్ అసలెందుకు లేదు?

హైదరాబాద్‌లో ఐమ్యాక్స్ అసలెందుకు లేదు?

దేశంలో తెలుగు ప్రేక్షకులను మించిన సినీ అభిమానులు ఉండరన్నది అందరూ అంగీకరించే సత్యం. సినిమా అన్నది మన జీవన విధానంలో భాగం. సినిమా లేని జీవితాలను మెజారిటీ జనం ఊహించలేరు. కరోనా వచ్చినపుడు కూడా ఒక బ్రేక్ తర్వాత ముందుగా థియేటర్లకు కదిలింది తెలుగు ప్రేక్షకులే. ఆ సమయంలో కూడా సినిమాలను గొప్పగా ఆదరించారు. రెండు తెలుగు రాష్ట్రాలను ఒక యూనిట్‌గా తీసుకుంటే.. దేశంలో మరెక్కడా లేనన్ని థియేటర్లు ఇక్కడున్నాయి. ఇండియాలో ఇంకెక్కడా లేనంత థియేట్రికల్ బిజినెస్ ఇక్కడ జరుగుతుంది.

మరి ఇంత పొటెన్షియల్ ఉన్న మార్కెట్లో ఒక్క ఐమాక్స్ స్క్రీన్ కూడా లేకపోవడం ఆశ్చర్యపరిచే విషయం. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోనూ ఐమాక్స్ స్క్రీన్లున్నాయి. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబయి.. ఇలా అన్ని ప్రధాన నగరాల్లోనూ ఒకటికి మించే ఐమాక్స్ స్క్రీన్లు ఉండగా.. హైదరాబాద్‌లో ఒక్కటీ లేకపోవడం విచారించాల్సిన విషయమే. హాలీవుడ్ భారీ సినిమాలను ఐమాక్స్ స్క్రీన్లలో చూసేందుకు మన సెలబ్రెటీలు చెన్నైకో, బెంగళూరుకో వెళ్తుంటారు. గతంలో ప్రసాద్స్‌లో ఐమాక్స్ స్క్రీన్ ఉండేది. కానీ మధ్యలో ఆ ఒప్పందం టెర్మినేట్ అయింది. అందులోనే ఇప్పుడు పీసీఎక్స్ స్క్రీన్ నడుస్తోంది.

ఏషియన్ సినిమాస్ వాళ్లు హైదరాబాద్‌లో ఐమాక్స్ స్క్రీన్ నిర్మించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ.. దాని గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఒప్పందం జరగలేదు. ఐతే తెలుగు రాష్ట్రాల్లో అసలెందుకు ఐమాక్స్ స్క్రీన్ లేదు అన్న ప్రశ్న తలెత్తడం సహజం. ఇక్కడ టికెట్ల ధరల విషయంలో క్యాప్ ఉండడం.. ఫ్లెక్సీ ప్రైసింగ్ సౌలభ్యం లేకపోవడమే కారణం అన్నది ఇండస్ట్రీ వర్గాల మాట.

ఐమాక్స్ స్క్రీన్లకు టికెట్ల ధరలు అధిక స్థాయిలో ఉంటాయి. సినిమాను, డిమాండును బట్టి రూ.1000కి అటు ఇటుగా రేటు పెడుతుంటారు. కానీ ఏపీ, తెలంగాణల్లో గరిష్ట ధర ఇంతకుమించరాదు అనే ప్రైస్ క్యాప్ ఉంది. కొత్త సినిమాలకు రేట్ల పెంపు కూడా ప్రత్యేకంగా జీవోల ద్వారా తెప్పించుకుంటారు తప్ప.. థియేటర్లు సొంతంగా రేట్లు పెంచుకోవడానికి వీల్లేదు. అందుకే ఇక్కడ ఐమాక్స్ స్క్రీన్లు రావడం లేదని అంటున్నారు. మరి కొత్తగా ఐమాక్స్ స్క్రీన్ తీసుకొస్తే పరిస్థితి ఏంటో చూడాలి. ముందే అధిక రేట్లు పెట్టుకోవడానికి ప్రత్యేకంగా అనుమతులు తీసుకుంటే తప్ప వీటిని వర్కవుట్ చేయడం కష్టం.

Related Post