టీడీపీ నాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఎంత సౌమ్యంగా ఉంటారో.. అంతే అసహనం కూడా ప్రదర్శిస్తారు. ముఖ్యంగా అభిమానులను ఆదరించే బాలయ్య.. అదే అభిమానులు గడుసుగా ప్రవర్తిస్తే.. బహి రంగంగానే వారిపై విరుచుకుపడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే.. ఇదంతా బాలయ్య అభిమానులు కామన్‌గానే తీసుకుంటారు. ఇలాంటి ఘటనే ఒకటి తాజాగా విశాఖ పర్యటనలోనూ చోటు చేసుకుంది. త్వరలోనే అఖండ-2 విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో తనకుఎంతో ప్రీతిపాత్రమైన సింహాచలం అప్పన్న దర్శనానికి బాలయ్య వచ్చారు.
ఈ క్రమంలో విశాఖ విమానాశ్రయానికి వచ్చిన బాలయ్యను చూసేందుకు అభిమానులు తండోపతండాలుగా తరలి వచ్చారు. అయితే.. వీరిని తొలుత ఆప్యాయంగానే పలకరించినప్పటికీ.. కొందరు అభిమానులు బాలయ్యతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. ఇది ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. ఇంతలో ఆయనను గతంలో విమర్శించిన ఓ వ్యక్తి కూడా అక్కడే కనిపించారు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన బాలయ్య.. “వీడెందుకు వచ్చాడు. నాకు కనిపించడానికి వీల్లేదు. సాయంత్రం ఫంక్షన్‌లోనూ వీడు రాకూడదు.“ అని బాలయ్య గర్జించారు. దీంతో అభిమానులు సదరు వ్యక్తిని పక్కకు తీసుకువెళ్లిపోయారు.
అనంతరం.. సింహాచలం చేరుకున్న బాలయ్య దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి సింహాచలం చేరుకున్నారు. అక్కడ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే హోదాతో పాటు సీనియర్ నటుడు కూడా కావడంతో బాలయ్యకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. తొలుత ఆలయంలోని `కప్ప స్తంభాన్ని` ఆలింగనం చేసుకున్న బాలయ్య.. అనంతరం, గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశాఖలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న అఖండ-2 విజయవంతం కావాలని కోరుకున్నట్టు కొద్ది మంది మీడియా మిత్రులకు బాలయ్య వెల్లడించారు.