అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు-మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు మద్వి హిడ్మా మృతిచెందాడు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా విధించిన డెడ్‌లైన్ కంటే ముందే హిడ్మాను ఎన్‌కౌంటర్ చేశారు. నవంబరు 30లోపు హిడ్మా ఆటకట్టించాలని భద్రతా బలగాలను అమిత్‌షా ఆదేశించినట్లు సమాచారం.
‘‘2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించాలని అమిత్ షా గడువు విధించారు. ఈ క్రమంలో జరిగిన భద్రతా సమీక్షా సమావేశంలో నవంబర్ 30లోగా హిడ్మా పనిపట్టాలని భద్రతా బలగాలకు ఆదేశాలు ఇచ్చారు. అయితే ఆ డెడ్‌లైన్ కన్నా ముందుగానే ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో హిడ్మా మృతిచెందడం గమనార్హం అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం జరుగుతోన్న ఆపరేషన్లను చూస్తుంటే… మార్చి కంటే ముందుగానే నక్సలిజం తుడిచిపెట్టుకుపోతుందని అంచనావేశాయి.
దేశంలో మావోయిస్టుల హింస, భావజాలాన్ని నిర్మూలించి శాంతిని నెలకొల్పాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారని గతంలో అమిత్ షా పేర్కొన్న సంగతి తెలిసిందే. హింసను, ఆయుధాలను వదిలేసి వారు లొంగిపోవాలని లేకపోతే మావోయిస్టుల అంతానికి ఆల్- అవుట్ ఆపరేషన్ నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి మారేడుమిల్లి ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్ కొనసాగుతున్నట్లు ఏపీ డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై సమాచారం నేపథ్యంలో కూంబింగ్ నిర్వహించినట్లు చెప్పారు.
నిర్దేశించిన లక్ష్యం కంటే ముందే పూర్తికానున్న ఆపరేషన్ కగార్
దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆపరేషన్ కగార్ నిర్దేశించుకున్న లక్ష్యాని కంటే ముందుగానే చేరుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాతోపాటు పలువురు మావోయిస్టులు మరణించారు. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ విజయవాడలో స్పందించారు. మావోయిస్టుల షెల్టర్ జోన్లు భగ్నం చేసే దిశగా పోలీసులు కదలడంతోపాటు విజయవాడలో మావోయిస్టుల అరెస్టులు అందుకు తార్కాణమని పేర్కొన్నారు.
మావోయిస్టులు మూలాలున్న అన్ని ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించాలని పోలీసులకు ఈ సందర్భంగా ఆయన సూచించారు. ప్రశాంతంగా ఉండే జిల్లాల్లో షెల్టర్ జోన్లుగా మావోయిస్టులు మార్చుకోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు. మావోయిస్టులకు షెల్టర్ ఇచ్చిన వారితోపాటు సహకారం అందిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలని పోలీసులకు ఆయన సూచించారు.
The post Amit Shah: హిడ్మా ఎన్ కౌంటర్ పై అమిత్ షా డెడ్‌లైన్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
Amit Shah: హిడ్మా ఎన్ కౌంటర్ పై అమిత్ షా డెడ్‌లైన్
Categories: