ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా బీజేపీ నేతల వ్యూహాలు భిన్నంగా ఉంటాయి. ఎన్నికలకు మూడు నాలుగు మాసాల ముందుకాదు.. ఏకంగా ఆరేడు మాసాల ముందే ప్లాన్ వేసుకుంటారు. ఎన్నికల కోడ్ రావడానికి ముందే రాజకీయ వ్యూహాలను అమలు చేసేస్తారు. ఇది బీజేపీ విజయానికి బలమైన దన్నుగా మారుతోంది. ఇప్పటి వరకు బీజేపీ దక్కించుకున్న రాష్ట్రాల పరిస్థితిని గమనిస్తే.. ఖచ్చితంగా ఈ తరహా వ్యూహం స్పష్టంగా కనిపిస్తుంది. బీహార్‌లో ఎన్డీయే విజయం దక్కించుకుంది. కానీ, దీనికి మూలాలు ఎక్కడున్నాయంటే.. ఏడు మాసాల ముందుగానే!.
ఎన్నికలకు ఏడు మాసాల ముందుగానే సీతాదేవి పుట్టిన ప్రాంతాన్ని హైలెట్ చేశారు. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఒకేసారి పలు ప్రాజెక్టులకు శ్రీకారం కూడా చుట్టారు. ఇక, ఎన్నికలకు రెండు మాసాల ముందే.. మహిళల ఖాతాల్లోకి రూ.10 వేల చొప్పున ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ నిధి కింద నిధులు జమ చేశారు. అంతేకాదు.. ముందుగానే పొత్తులపై చర్చించారు. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలోనూ ప్రకటన చేశారు. ఇలా.. ఎక్కడ విజయం కావాలంటే అక్కడ అవసరానికి అనుగుణంగా బీజేపీ వ్యూహాలువేస్తోంది. వాటిని మోడీ కూడా చక్కగా పాటిస్తున్నారు.
ఇక, ఇప్పుడు తమిళనాడు వంతు వచ్చింది. వచ్చే ఏడాది మార్చి-మే మధ్య కాలంలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకున్నారో ఏమో.. ప్రధాని మోడీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తాజాగా బుధవారం(నవంబరు 19)నాడు ఆయన తమిళనాడులో పర్యటిస్తున్నారు. అంతేకాదు.. ఇక్కడి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సొంత జిల్లా కోయంబత్తూరుకు వెళ్తున్నారు. అంతేనా.. దేశవ్యాప్తంగా రైతులకు మూడు విడతలుగా అందించే పీఎం-కిసాన్ నిధులను కూడా ప్రధాని ఇక్కడ నుంచే విడుదల చేశారు. వాస్తవానికి ఈ కార్యక్రమం ఎప్పుడూ.. ఢిల్లీ వేదికగానే నిర్వహిస్తున్నారు.
కానీ, గత ఆగస్టులో ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు సంబంధించిన నిధులను బీహార్ వేదికగా(ఎన్నికలకు ముందు) ప్రధాని మోడీ విడుదల చేశారు. ఇప్పుడు రెండో విడత నిధులను త్వరలోనే ఎన్నికలు జరగనున్న తమిళనాడు వేదికగా విడుదల చేయనున్నారు. ఇక, ఇప్పటికే తమిళనాడుకు చెందిన బీసీ నాయకుడుసీపీ రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతిని చేశామని బీజేపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రధాని మోడీ పర్యటన.. వెరసి.. మొత్తంగా ఆపరేషన్ తమిళనాడును ప్రారంభించేశారన్న వాదన బలంగా వినిపిస్తోంది. మరి..తమిళలు బీజేపీవైపు.. మోడీ దిశగా మొగ్గు చూపుతారా? అనేది చూడాలి.