hyderabadupdates.com Gallery TG High Court: గ్రూప్‌-2 రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పు

TG High Court: గ్రూప్‌-2 రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పు

TG High Court: గ్రూప్‌-2 రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పు post thumbnail image

 
 
2015-16 గ్రూప్‌-2ను రద్దు చేస్తూ మంగళవారం హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నాటి ఎంపిక జాబితాను కొట్టివేసింది. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పు, సాంకేతిక కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా డబుల్‌ బబ్లింగ్, వైట్‌నర్‌ వినియోగం, తుడిపివేతలున్న పార్ట్‌-బి పత్రాలను పునర్‌ మూల్యాంకనం చేయడం చెల్లదని పేర్కొంది. హైకోర్టు తీర్పు, సాంకేతిక కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా వ్యవహరించే అధికారం తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు లేదని తేల్చి చెప్పింది. జవాబు పత్రాల్లో ట్యాంపరింగ్‌ జరిగిందని స్పష్టంగా కనిపిస్తున్నపుడు వాటిని పక్కన
పెట్టకపోవడం కమిషన్‌ వైఫల్యమేనని తేల్చి చెప్పింది. 2019 అక్టోబరు 24న ఇచ్చిన ఫలితాలు ఏకపక్షమని, చట్టవిరుద్ధమని వాటిని రద్దు చేసింది. సాంకేతిక కమిటీ సిఫార్సులు, హైకోర్టు తీర్పునకుఅనుగుణంగా తిరిగి మూల్యాంకనం నిర్వహించి అర్హుల జాబితాను విడుదల చేసి నియామకాలు చేపట్టాలని, ఈ ప్రక్రియను 8 వారాల్లో పూర్తి చేయాలని పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. దిద్దుబాటు, వైట్‌నర్‌ వినియోగం, డబుల్‌ బబ్లింగ్‌ జరిపినవాటిని మూల్యాంకనం చేయడం ద్వారా చేపట్టిన నియామకాలను రద్దు చేయాలంటూ పలువురు దాఖలు చేసిన 6 పిటిషన్‌లపై జస్టిస్‌ నగేశ్‌ భీమపాక విచారణ చేపట్టి ఈమేరకు తీర్పు వెలువరించారు.
ఇదీ పిటిషనర్ల కేసు
గ్రూప్‌-2 కింద 13 కేటగిరీల్లో 1,032 పోస్టుల భర్తీకి 2015 నోటిఫికేషన్‌ జారీ కాగా, 2016లో అనుబంధ నోటిఫికేషన్‌ జారీ అయింది. 2016 నవంబరు 11, 13 తేదీల్లో రాత పరీక్షలు జరిగాయి. ప్రశ్న పత్రం బుక్‌లెట్‌కు, ఓఎంఆర్‌ షీట్లకు పొంతన కుదరకపోవడంతో ఈ సమస్య పరిష్కారానికి 2016 డిసెంబరులో కమిషన్‌ సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ అధ్యయనం చేసి 2017 మార్చిలో నివేదిక సమర్పించింది. ప్రశ్న పత్రంలోని బుక్‌లెట్‌ నంబరు, ఓఎంఆర్‌ నంబరు ఒకటే ఉండాలని అభ్యర్థులు, ఇన్విజిలేటర్లు భావించడం వల్ల ఈ గందరగోళం తలెత్తిందని కమిటీ నివేదికలో పేర్కొంది. ఓఎంఆర్‌ షీట్‌ పార్ట్‌-ఎలోని అభ్యర్థి వ్యక్తిగత వివరాలకు సంబంధించి చిన్నచిన్న పొరపాట్లు ఉంటే మన్నించవచ్చని, అయితే పార్ట్‌-బిలోని 150 ప్రశ్నల జవాబులకు ఏదైనా తుడిచివేత, వైట్‌నర్‌ వాడినట్లయితే వాటిని మూల్యాంకనం చేయరాదని కమిటీ సిఫార్సు చేసింది.
ఈ వ్యవహారంపై కొందరు హైకోర్టును ఆశ్రయించగా సింగిల్‌ జడ్జి మాన్యువల్‌గా మూల్యాంకనం చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించగా ఇరుపక్షాల వాదనలను విని సాంకేతిక కమిటీ సిఫార్సులను సమర్థిస్తూ వాటి ప్రకారం మూల్యాంకనం చేపట్టాలంటూ 2019 జూన్‌ 6న తీర్పు వెలువరించింది. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పు అమలు ముసుగులో ఓఎంఆర్‌ షీట్‌లలో వైట్‌నర్, తుడిచివేతలకు పాల్పడిన అభ్యర్థుల పత్రాలను మూల్యాంకనం చేయడం ద్వారా ఆ తీర్పు స్ఫూర్తికి విరుద్ధంగా కమిషన్‌ వ్యవహరించిందని పలువురు పిటిషన్‌లు దాఖలు చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాలను టీజీపీఎస్సీ అధ్యయనం చేస్తోంది. కోర్టునుంచి అధికారికంగా తీర్పు కాపీ అందిన తర్వాత బోర్డు సమావేశం కానుంది.
కమిషన్‌ వైఫల్యమే
జవాబు పత్రాల్లో ట్యాంపరింగ్‌ జరిగిందని స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు వాటిని పక్కనపెట్టకపోవడం కమిషన్‌ వైఫల్యమే. కేవలం ఓఎంఆర్‌ షీట్‌లోని పార్ట్‌-ఎలోని తప్పులను సరిదిద్దడానికి సాంకేతిక కమిటీ, హైకోర్టు అనుమతించాయి. దీనికి విరుద్ధంగా పార్ట్‌-బిలో ప్రశ్నలను మూల్యాంకనం చేసే అధికారం కమిషన్‌కు లేదు. ఇది పరీక్ష సమగ్రతను దెబ్బతీస్తుంది. అన్ని పేపర్లకు మూల్యాంకనాన్ని విస్తరించడం చట్టవిరుద్ధం, ఏకపక్షం. ఇది కమిషన్‌ చట్టబద్ధ అధికారాల పరిధిని దాటి వ్యవహరించడమే. అందువల్ల 2019 అక్టోబరు 24న విడుదల చేసిన ఎంపిక జాబితాను రద్దు చేస్తున్నాం. హైకోర్టు, సాంకేతిక కమిటీ సిఫార్సుల మేరకు 8 వారాల్లో తిరిగి మూల్యాంకనం చేపట్టి నియామక ఉత్తర్వులు జారీ చేయాలి. అక్రమాల నివారణకు భవిష్యత్తులో ఓఎంఆర్‌ షీట్‌లో పేర్కొన్న సూచనలకు కట్టుబడి ఉండాలి. భౌతిక, వీడియోగ్రఫీ ద్వారా పర్యవేక్షణ జరగాలి.
 
పారదర్శకంగా మూల్యాంకనం – కమిషన్‌
భౌతికంగా రీవాల్యుయేషన్‌ చేపట్టాలన్న ఉత్తర్వులను డివిజన్‌ బెంచ్‌ రద్దు చేసిందని కమిషన్‌ తెలిపింది. ‘యాంత్రిక వ్యవస్థ ద్వారా జరిగిన మూల్యాంకనంలో పక్షపాతానికి, దురుద్దేశాలకు అవకాశం లేదు. ఇప్పటికే నియామకాలు పూర్తయ్యాయి. వారంతా విధుల్లో ఉన్నారు. దురుద్దేశం, పక్షపాతం ఉంటేనే కోర్టులు జోక్యం చేసుకోవాలి. లేదంటే నియమాక ప్రక్రియలోకి న్యాయవ్యవస్థ వెళ్లకూడదని సుప్రీంకోర్టు వెల్లడించింది’ అని తెలిపింది.
The post TG High Court: గ్రూప్‌-2 రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Diwali: రాజస్థాన్ లో కిలో స్వీట్ రూ. 1.11 లక్షలుDiwali: రాజస్థాన్ లో కిలో స్వీట్ రూ. 1.11 లక్షలు

Diwali : పండగల వేళ.. ముఖ్యంగా దసరా, దీపావళి వేళ.. తమ సంస్థ ఉద్యోగులకు స్వీట్లు అందజేస్తాయి యాజమాన్యం. దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని సంస్థలు ఈ విధంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో దీపావళీకి మిఠాయి షాపుల్లో స్వీట్స్‌కు భారీగా డిమాండ్ ఏర్పడింది. అలాగే

వ‌ద్ద‌నుకుంటే విషం ఇచ్చి చంపేయండి : కోమ‌టిరెడ్డివ‌ద్ద‌నుకుంటే విషం ఇచ్చి చంపేయండి : కోమ‌టిరెడ్డి

హైద‌రాబాద్ : రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల‌, సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌కు ఓ సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ కు మ‌ధ్య ప్రేమాయ‌ణం న‌డుస్తోందంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌ర‌గ‌డం, విస్తృతంగా సామాజిక మాధ్య‌మాల‌లో