లోకనాయకుడు కమల్ హాసన్ ఫాన్స్ఎప్పటికీ మర్చిపోలేని పేరు మరుదనాయగం. దీని వెనుకో పెద్ద చరిత్రే ఉంది కానీ సింపుల్ గా చెప్పకుందాం. 1996లో భారతీయుడు బ్లాక్ బస్టర్ అయ్యాక కమల్ తన స్వీయ దర్శకత్వంలో ఈ ప్యాన్ ఇండియా మూవీని మొదలుపెట్టారు. ఇళయరాజా మ్యూజిక్ కంపోజింగ్ చేశారు. 1997లో బ్రిటిష్ రాణి ఎలిజిబెత్, తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి అతిథులుగా అంగరంగ వైభవంగా మదరాసు ఫిలిం సిటీలో ఓపెనింగ్ చేశారు. దీనికి చేసిన ఏర్పాట్లు చూసి మీడియా తెల్లబోయింది. తెలుగు పత్రికల్లో సైతం పతాక శీర్షికల్లో ఈ వేడుక గురించి బోలెడు కథనాలు రాశారు.
ఓ రెండేళ్లు షూటింగ్ జరిగాక మరుదనాయగం అర్ధాంతరంగా ఆగిపోయింది. ప్రొడక్షన్ పార్ట్ నర్ గా ఉన్న ఒక హాలీవుడ్ సంస్థ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో ఫండింగ్ తెచ్చుకోవడం కమల్ హాసన్ వల్ల కాలేదు. అప్పట్లోనే దీనికి యాభై కోట్ల బడ్జెట్ వేసుకున్నారట. పది ఇరవై రూపాయల టికెట్ రేట్లకు ఇది రికవర్ కావాలంటే వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ అవ్వాలి. పీరియాడిక్ డ్రామాని నేపథ్యంగా తీసుకున్న మరుదనాయగంలో విష్ణువర్ధన్, సత్యరాజ్, నాజర్, అమ్రిష్ పురి, నసీరుద్దీన్ షా, పశుపతి, గౌతమి లాంటి పెద్ద క్యాస్టింగ్ ఉంది. ఐశ్వర్యరాయ్, కేట్ విన్ స్లెట్ లను అడిగారనే టాక్ గట్టిగానే చక్కర్లు కొట్టింది.
దేశవిదేశాల తిరిగి ప్రీ ప్రొడక్షన్ కోసమే కోట్లు ఖర్చుపెట్టారు కమల్ హాసన్. కానీ ఫలితం దక్కలేదు. తర్వాత చాలా ప్రయత్నాలు చేశారు కానీ 1999లో మరుదనాయగం ఆపేసినట్టు ప్రకటించారు. ఇప్పుడు రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ దీని వైపు కమల్ చూస్తున్నారట. ఇటీవలే కలిసిన జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు భాగంగా సమాధానమిస్తూ ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకుని పూర్తి చేయొచ్చనే దిశగా సంకేతం ఇవ్వడం ఫ్యాన్స్ లో ఆనందం నింపుతోంది. వారణాసి ట్రైలర్ లో మహేష్ బాబు గ్రాఫిక్స్ నంది మీద స్వారీ చేస్తే మరుదనాయగంలో నిజమైన ఎద్దు మీద కమల్ పరుగులు పెట్టారు. ఆ వీడియో వైరల్ అవుతోంది. అందుకే కమల్ హాసన్ కు ఈ క్వశ్చన్ ఎదురయ్యింది.