ఒక ఉప ఎన్నిక అనేక మార్పులకు దారి తీస్తోంది. పార్టీలు ఏవైనా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్‌లో అసమ్మతి స్వరాలు తగ్గాయి. సీఎం రేవంత్ సహా పార్టీ అధిష్ఠానంపై ఉన్న అసంతృప్తి కూడా తగ్గుముఖం పట్టింది. మరోవైపు బీఆర్‌ఎస్‌లోనూ మార్పులు కనిపిస్తున్నాయి. పార్టీ వ్యూహాలు మార్చుకోవాలన్న వాదన బలంగా వినిపిస్తోంది. బీఆర్‌ఎస్‌ను మరింత పటిష్ఠంగా ముందుకు తీసుకువెళ్లాలంటే వ్యూహాత్మకంగా ఆలోచించాల్సిందే అన్న చర్చ జరుగుతోంది.
ఇదిలావుంటే, ఇదే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీలో చీలిక దిశగా అడుగులు వేసేలా చేస్తోందన్న చర్చ సాగుతోంది. కొందరు నేతల మధ్య వ్యక్తిగత వివాదాలు, విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కీలక నాయకుడు ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు.
ఆ తర్వాత కిషన్ రెడ్డిని కేంద్రంగా చేసుకుని వివాదాలు మరింత పెరుగుతున్నాయి. పైకి ద్వితీయ శ్రేణి నాయకులు మౌనంగా ఉన్నప్పటికీ, అంతర్గత చర్చల్లో కిషన్ రెడ్డి వ్యవహార శైలిపై నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
అదేవిధంగా మాజీ మంత్రి, ఎంపీ ఈటల రాజేందర్ మరియు కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య ఉన్న విభేదాలు జూబ్లీహిల్స్ ఫలితం తర్వాత మరింత తీవ్రమయ్యాయి. బండి సంజయ్ ఇటీవల మాట్లాడుతూ తాను హిందువునేనని, తన ప్రాణం ఉన్నంతవరకు హిందూత్వమే తన మార్గమని అన్నారు. దీనికి ఈటల ఘాటు కౌంటర్ ఇచ్చారు. తత్వం తెలంగాణలో పనిచేయదని, బరాబర్ హిందుత్వ అజెండాతో ప్రతి ఎన్నికలో పోటీ చేయడం సరికాదని చెప్పారు.
అంతేకాదు, కేవలం హిందుత్వ అజెండానే జూబ్లీహిల్స్‌లో బీజేపీని దెబ్బ కొట్టిందని, అందుకే డిపాజిట్ కూడా రాలేదని ఈటల అంటున్నారు. నేరుగా బండి పేరును ప్రస్తావిస్తూ వారి మత ప్రచారం మరియు అతివాద ధోరణి వల్లే జూబ్లీహిల్స్ పోయిందని వ్యాఖ్యానించారు. అభివృద్ధిని అజెండా చేసుకుని ఉంటే ఫలితం బాగుండేదని అన్నారు.
దీంతో బీజేపీలో మతపరమైన అజెండాను పట్టుకునే నేతలు మరియు దానికి తటస్థంగా ఉండే నేతల మధ్య స్పష్టమైన చీలిక కనిపిస్తున్నదన్న వాదన బలపడుతోంది.