మత్స్యకార యువతకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ చెప్పారు. స్పీడ్ బోటింగ్, స్కూబా డైవింగ్ తదితర జల క్రీడల్లో మత్స్యకార యువతకు శిక్షణ ఇప్పించడం ద్వారా మన రాష్ట్ర తీర ప్రాంతాలను టూరిజం హాట్ స్పాట్లుగా తీర్చిదిద్దుతాం అన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. తీర ప్రాంత మత్స్యకారులకు వేటతోపాటు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపైనా దృష్టి సారించాం అన్నారు.
మత్స్యకారుల్లోని అద్భుతమైన ఈత సామర్థ్యాన్ని వినియోగించుకుంటూ కేరళ తరహాలో తీర ప్రాంత పర్యటక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. అందుకోసం కాకినాడ తీర ప్రాంతం నుంచి కొంత మంది మత్స్యకారులను కేరళ తీసుకువెళ్లి అక్కడ మత్స్యకారులు నిర్వహిస్తున్న ఎకో టూరిజం స్పాట్ల వద్ద శిక్షణ ఇస్తామన్నారు.
చెన్నై హార్బర్ సమీపంలోని తిరువత్రియుర్ కుప్పం తీరంతో విజయవంతంగా నిర్వహిస్తున్న కృత్రిమ రీఫ్ కల్చర్ సందర్శనకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు. డిసెంబర్ రెండో వారంలో ఉప్పాడ,కాకినాడ తీర ప్రాంతాలకు చెందిన మత్స్యకారులను తమిళనాడు, కేరళ రాష్ట్రాల సందర్శనకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
కాకినాడ జిల్లా మత్స్యకార సోదరులకు ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల ప్రణాళికను అమలు చేసేందుకు రోడ్ మ్యాప్ తుది దశకు చేరిందన్నారు. తీర ప్రాంతంలో అంతరించిపోతున్న మత్స్య సంపదను పెంపొందించే చర్యలతోపాటు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల కల్పనపైనా దృష్టి సారించామని తెలిపారు. మన మత్స్యకారులను తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు తీసుకువెళ్లి అక్కడ విజయవంతమైన కృత్రిమ రీఫ్ కల్చర్, కోస్టల్ టూరిజం యూనిట్ల సందర్శనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.