ఇండియన్ వెబ్ సిరీస్ చరిత్రలో ‘ఫ్యామిలీ మ్యాన్’ను మించి ఆదరణ పొందిన ఒరిజినల్ ఇంకోటి లేదు అంటే అతిశయోక్తి కాదు. నటుడిగా ఎప్పుడో లెజెండరీ స్టేటస్ అందుకున్నప్పటికీ.. ఈ సిరీస్‌తో మనోజ్ బాజ్‌పేయికి మామూలు పేరు రాలేదు. ఇక దర్శకులుగా రాజ్-డీకే సైతం వేరే లెవెల్‌కు వెళ్లిపోయారు. ఈ సిరీస్ సక్సెస్ అయ్యాక వాళ్లు సినిమాలకు స్వస్తి చెప్పి.. వెబ్ సిరీస్‌లే చేస్తున్నారు. కానీ ‘ఫ్యామిలీ మ్యాన్’ అయినంత సక్సెస్ ఇంకేదీ కాలేదు.
ఇప్పటికే రెండు సీజన్లతో అలరించిన ఈ సిరీస్ ఇప్పుడు మూడో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొన్న అర్ధరాత్రి స్ట్రీమింగ్ మొదలైనప్పటి నుంచి ఇది ట్రెండింగ్‌లో ఉంది. మరోసారి స్ట్రీమింగ్ రికార్డులను ‘ఫ్యామిలీ మ్యాన్’ బద్దలు కొడుతుందనే అంచనాలున్నాయి. మరి ఇంత క్రేజీ సిరీస్‌లో నటించేందుకు ప్రధాన పాత్రధారుల్లో ఎవరు ఎంత పుచ్చుకున్నారన్నది ఆసక్తికరం.
మూడో సీజన్ కోసం ‘ఫ్యామిలీ మ్యాన్’ హీరో, శ్రీకాంత్ తివారి పాత్రధారి మనోజ్ బాజ్‌పేయి రూ.22.5 కోట్లు పారితోషకంగా అందుకున్నాడట. మనోజ్‌కు జోడీగా సుచిత్ర పాత్రలో వరుసగా మూడో సీజన్లోనూ నటించిన ప్రియమణి.. ఈసారి రూ.7 కోట్ల రెమ్యూనరేషన్ అందినట్లు సమాచారం. పాతాళ్ లోక్ సిరీస్‌తో బంపర్ క్రేజ్ తెచ్చుకుని.. ‘ఫ్యామిలీ మ్యాన్-3’లో విలన్ పాత్ర చేసిన జైదీప్ అహ్లావత్ రూ.9 కోట్లు పుచ్చుకున్నాడట. జేకే తల్పాడే పాత్రలో భలేగా వినోదాన్ని పంచుతున్న షరిబ్ హష్మి మూడో సీజన్‌కు రూ.5 కోట్లు తీసుకున్నాడట.
నిమ్రత్ కౌర్ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. తనకున్న క్రేజ్ దృష్ట్యా రూ.9 కోట్ల పారితోషకం తీసుకుందని సమాచారం. అంతకంటే తక్కువ నిడివే అయినప్పటికీ.. దర్శన్ కుమార్ రూ.8 కోట్ల దాకా పారితోషకం తీసుకున్నాడట. ఇంకా ఇందులో విజయ్ సేతుపతి, శ్రేయా ధన్వంతరి, సందీప్ కిషన్ చిన్న చిన్న పాత్రల్లో నటించారు. మొత్తంగా పారితోషకాలు మాత్రమే చూసుకున్నా బడ్జెట్ రూ.100 కోట్లకు తక్కువ అయి ఉండదని అంచనా.