మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. ప్రస్తుతం ఆయన రిజర్వ్‌లో ఉన్నారని కొందరు, కాదు వెయిటింగ్‌లో ఉన్నారంటూ మరికొందరు చెప్పుకుంటున్నారు. నిజానికి ఇది కొంచెం విచిత్రంగా ఉన్నా, రాజకీయంగా మాత్రం ఆసక్తికర చర్చగా మారింది.
ఇటీవల మంగళగిరి పార్టీ కార్యాలయంలో టీడీపీ నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంలో యనమల చర్చ వచ్చింది. అందులో కొందరు ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. తనకు చిరకాల కోరికగా రాజ్యసభ మిగిలిపోయిందన్న యనమల, ఎప్పటికైనా వెళ్లాలి అన్న ఆశ ఇంకా ఉందని తెలిపారు. ఇదే విషయాన్ని తూర్పు నేతలు కూడా ప్రస్తావించారు.
దీనిపై సీనియర్ నాయకుడు ఒకరు స్పందిస్తూ, ఆయన వెయిటింగ్ లిస్టులో ఉన్నారని అన్నారు. వెంటనే మరొకరు కాదు కాదు, యనమలకు ఒక కీలక పోస్టు రిజర్వ్ చేశారని చెప్పారు. దీంతో యనమల వ్యవహారంలో పోస్టు రిజర్వ్ చేసారా లేదా వెయిటింగ్‌లో పెట్టారా అన్నది చర్చనీయాంశమైంది.
ఇదిలా ఉండగా, కీలక బాధ్యుల వర్గంలో మరో టాక్ వినిపిస్తోంది. ఇప్పటి పరిస్థితిలో అలాంటిదేమీ లేదని, యనమల స్థాయికి సరిపోయే పదవులు ఇవ్వాలంటే కొంత సమయం పడుతుందని అంటున్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రానుండగా, పార్టీ పరంగా ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అధిష్టానం స్థాయిలో అయితే యనమల పేరు ఎక్కడా వినిపించడం లేదు. ఆయనకు ఏ పదవి ఇస్తారన్న దానిపై కూడా స్పష్టత లేదు.
ఇక, కొన్నాళ్ల మౌనం తర్వాత యనమల ఇటీవల కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై వైసీపీ చేపట్టిన నిరసనలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వం వీటిని లైట్‌గా తీసుకుంటోందని, అలా చేయడం సరికాదని చెప్పారు. వైసీపీ చేస్తున్న ఆందోళనలు క్షేత్రస్థాయికి చేరుతున్నాయని కూడా పేర్కొన్నారు. ఇది ఏదైనా సూచనా లేక మరేదైనా సంకేతమా అనేదే క్లారిటీ లేదు.
అదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి ఆయన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారన్న మాట. మరి యనమల రిజర్వ్‌లో ఉన్నారా లేదా వెయిటింగ్‌లో ఉన్నారా అనేది చూడాలి.