వైసీపీలో కీలక నేతగా గుర్తింపు పొంది, రెండుసార్లు ఎంపీ పదవిని అనుభవించిన విజయసాయి రెడ్డి పాలిటిక్స్ రీ ఎంట్రీ చేయనున్నారా..? వస్తే ఈ పార్టీలోకి వెళ్తారు? సొంతగా పార్టీ పెడతారా? ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది. అవరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం తనకు ఏ రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం లేదని, అవసరమైతే తిరిగి రావడానికి వెనకడుగు వేయనని తేల్చి చెప్పారు.
జగన్ చుట్టూ కోటరీ గురించి ఆయన మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను ఆ కోటరీనే డైవర్ట్ చేస్తోందన్నారు. నిబద్ధత లేని వారి మాటల్ని జగన్ నమ్మొద్దంటూ మీడియా ద్వారా ఆయన సూచించారు. ఇప్పటి వరకూ తనకు ఏ రాజకీయ పార్టీ నుంచీ పిలుపు రాలేదని స్పష్టం చేశారు. కానీ తనపై చాలా ఒత్తిళ్లు వచ్చాయని, వాటికి ఏమాత్రం తలొగ్గలేదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ పై తన వైఖరిపైనా వివరణ ఇచ్చారు. పవన్ కల్యాణ్ తో తనకు 20 ఏళ్ల స్నేహం ఉందన్నారు. ఆయనను తానెప్పుడూ విమర్శించలేదని తెలిపారు. పవన్ తనకు కేవలం మిత్రుడని స్పష్టం చేస్తున్నానన్నారు.
వైసీపీలోంచి బయటకు వచ్చిన తర్వాత విజయసాయి వ్యవసాయం చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తానని ప్రకటించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలను కూడా తరచూ ఆయన ట్వీట్ల ద్వారా సమర్థిస్తున్నారు. ఒక దశలో ఆయన బిజెపిలో చేరతారనే ఊహాగానాలు కూడా వినిపించాయి.
జనసేన పార్టీతో కూడా ఆయన సానుకూలంగానే ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ను విమర్శించే వారు కాదు. ఇప్పుడూ అయన అదే చెప్పారు. అవసరమైతే రాజకీయాల్లోకి వస్తానని ఇప్పుడు చెప్పడం ఆ రెండు పార్టీలలో ఏ పార్టీలో చేరతాడు అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది.