ఏడాదిన్నర కిందట బెంగళూరులో జరిగిన ఒక రేవ్ పార్టీలో టాలీవుడ్ సీనియర్ నటి హేమ పాల్గొన్నట్లు ఆరోపణలు రావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఐతే తాను ఆ పార్టీకి హాజరే కాలేదని.. ఆ టైంలో తాను హైదరాబాద్‌లోని ఒక ఫాం హౌస్‌లో ఉన్నానని అప్పట్లో హేమ ఒక వీడియో రిలీజ్ చేసింది. కానీ ఈ వ్యవహారానికి సంబంధించి విచారణకు రావాలంటూ హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. కొన్ని రోజుల పాటు మీడియాలో ఈ వ్వవహారం నానింది. తర్వాత అందరూ ఈ వ్యవహారాన్ని మరిచిపోయారు.
ఐతే అప్పుడు తన మీద వచ్చినవి అబద్ధపు ఆరోపణలని.. ఆ ఫేక్ న్యూస్ వల్ల తాను తన తల్లిని కోల్పోయానని హేమ తాజాగా తీవ్ర ఆవేదనతో ఒక వీడియో రిలీజ్ చేసింది. రేవ్ పార్టీ వ్యవహారానికి సంబంధించి తాను నిర్దోషినంటూ కోర్టు తీర్పు కూడా వచ్చిందని.. కానీ తనపై వచ్చిన ఫేక్ న్యూస్ వల్ల తల్లినే కోల్పోయానని.. ఆ వార్తలు నమ్మి తన మీద నిందలు వేసిన వాళ్లు తన తల్లిని వెనక్కి తీసుకురాగలరా అని మేమ ప్రశ్నించింది.
”నాపై కేసును కర్ణాటక హైకోర్టును కొట్టి వేసింది. నవంబరు 3న దీనికి సంబంధించి తీర్పు వచ్చింది. జడ్జిమెంట్ కాపీ వచ్చే వరకు ఈ విషయాన్ని ప్రకటించకూడదని ఇప్పటి వరకు ఆగాను. ఈ సంతోషకర వార్తను మా అమ్మతో పంచుకోగలిగాను. కానీ నేను ఈ సమస్యలో చిక్కుకోవడాన్ని ఆమె తట్టుకోలేకపోయారు. సోషల్ మీడియాలో ట్రోల్స్, అసత్య ప్రచారాల వల్ల ఆమె కుంగిపోయారు. తన ఆరోగ్యం దెబ్బ తింది.
ఫేక్ న్యూస్‌లు వద్దని నేను మొదట్నుంచి చెబుతూనే ఉన్నా. నేను ఏ తప్పు చేయలేదని అంటున్నా వినిపించుకోలేదు. ఇప్పుడు కేసు గెలిచా. కానీ అమ్మ లేదు. నాపై వచ్చిన ఫేక్ న్యూస్‌లను తట్టుకోలేకే మా అమ్మ ఆరోగ్యం దెబ్బ తింది. ఇటీవలే ఆమె చనిపోయారు. నా గురించి తప్పుగా రాసిన వాళ్లు, మాట్లాడిన వాళ్లు నాకు నా తల్లిని ఇవ్వగలుగుతారా? ఏడాదిన్నరగా ఈ విషయం వల్ల మానసిక క్షోభను అనుభవిస్తున్నా” అని హేమ ఆవేదన వ్యక్తం చేసింది. రేవ్ పార్టీ ఆరోపణల నేపథ్యంలో హేమపై మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ సస్పెన్షన్ విధించి, తర్వాత ఎత్తివేసింది. ఐతే ఈ వ్యవహారం తర్వాత ఆమె పెద్దగా సినిమాల్లో కనిపించలేదు.