hyderabadupdates.com movies ఇక ఏపీ 26 కాదు 29 జిల్లాలు.. ఫైనల్ చేసిన సీఎం

ఇక ఏపీ 26 కాదు 29 జిల్లాలు.. ఫైనల్ చేసిన సీఎం

ఏపీలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నూతనంగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. రంపచోడవరం కేంద్రంగా కొత్తగా పోలవరం జిల్లా ఏర్పడనుంది. ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారు. సచివాలయంలో జిల్లాల పునర్విభజన, డివిజన్లు, మండలాల మార్పు చేర్పులపై సీఎం చంద్రబాబు ఈ రోజు సమీక్షించారు. సమీక్షకు మంత్రులు అనగాని సత్యప్రసాద్, వి.అనిత, పి. నారాయణ, బీసీ జనార్ధన్ రెడ్డి, నిమ్మల రామానాయుడు హాజరయ్యారు.

కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటుపై ఇప్పటికే కమిటీ అధ్యయనం చేసింది. కొత్తగా ఏర్పాటు అయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు డివిజన్ ఏర్పాటుకు నిర్ణయించారు. నంద్యాల జిల్లాలో బనగానపల్లె రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తారు. సత్య సాయి జిల్లాలో మడకశిర రెవిన్యూ డివిజన్ ఏర్పాటు కానుంది. కర్నూలు జిల్లా పెద్ద హరివనాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేస్తారు. ఆదోని మండలాన్ని విభజించి కొత్త మండలం ఏర్పాటు చేస్తారు. మూడు కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీలో జిల్లాల సంఖ్య 29కి చేరనుంది. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో అద్దంకి రెవిన్యూ డివిజన్ ఏర్పాటుకు నిర్ణయించారు. 

అయితే వైసీపీ…ఇది రాజకీయంగా జరిగిన పునర్విభజన అంటూ విమర్శిస్తోంది. వైఎస్ జగన్ హయాంలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాల ఏర్పాటు జరిగిందని చెబుతోంది. అప్పట్లో 13 కొత్త జిల్లాలు, 25 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు. విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు కూడా పెట్టామని వైసీపీ చెబుతోంది. చంద్రబాబు నియోజకవర్గం కుప్పంను రెవెన్యూ డివిజన్ చేసినట్లు గుర్తు చేస్తోంది. శాస్త్రీయంగా జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణపై వక్రీకరణలు చేస్తున్నారని, ప్రసుత్తం స్వార్థం కోసం కొత్త జిల్లాలతో రాజకీయం చేస్తున్నారనేది వైసీపీ వాదన.

Related Post