hyderabadupdates.com movies ఇక‌ రైతు బాబు.. ఈ చంద్ర‌బాబు… !

ఇక‌ రైతు బాబు.. ఈ చంద్ర‌బాబు… !

రైతుల ప‌క్ష‌పాతిగా వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి ఉన్న పేరు అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న హ‌యాం చిన్న‌దే అయినా.. ఎక్కువ‌గా రైతుల‌కు మేలు చేశార‌న్న వాద‌న ఉంది. ఇది.. త‌దుప‌రి ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు అవ‌కాశంగా మారింది. 2004-09 మ‌ధ్య తీసుకున్న ప‌లు నిర్ణ‌యాలు.. 2009లో కూడా క‌లిసి వ‌చ్చాయి. ఇక‌, ఆ త‌ర్వాత‌.. అదే త‌ర‌హాలో అన్న‌దాత‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకున్న నాయ‌కులు పెద్ద‌గా క‌నిపించ‌లేదు.

ఈ విష‌యంలో జ‌గ‌న్ కొంత మేర‌కు ప్ర‌య‌త్నం చేసినా.. బ‌ట‌న్ నొక్కుడుకు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యారన్న వాద‌న ఉంది. నిజానికి రైతు భ‌రోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు ఏ స‌మ‌స్య వ‌చ్చినా.. అక్క‌డ చెప్పుకొనే అవ‌కాశం క‌ల్పించారు. కానీ, చివ‌రిలో రైతుల భూముల‌కు సంబంధించి చేసిన స‌ర్వేలు.. వారికి ఇచ్చిన ప‌ట్టాల‌పై త‌న ఫొటోలు వేసుకోవ‌డం.. స‌రిహ‌ద్దు రాళ్ల‌పైనా త‌న చిత్త‌రువును చిత్రించ‌డంవంటివి జ‌గ‌న్‌కు- రైతుల‌కు మ‌ధ్య గ్యాప్‌ను భారీగా పెంచాయి.

ఈ ప‌రిణామాలు.. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌కు మైన‌స్ మార్కులు వేయించాయి. ఈ ప‌రిస్థితి ఇలా ఉంటే.. తాజాగా సీఎం చంద్ర‌బాబు రైతుల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. సోమ‌వారం నుంచి రైతన్నా మీ కోసం కార్య‌క్ర‌మం ద్వారా గ‌తానికి భిన్నంగా రైతుల‌కు చేరువ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీనిలో భాగంగా రైతుల స‌మ‌స్య‌ల‌ను విన‌డంతోపాటు.. వారిని అధునాతన సాగువైపు మ‌ళ్లించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా అగ్రిటెక్‌వైపు న‌డిపించాల‌ని యోచిస్తున్నారు.

వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చడమే ప్రధాన లక్ష్యంగా సోమ‌వారం నుంచి వారం రోజుల పాటు ‘రైతన్నా.. మీకోసం’ అనే కార్యక్రమానికి  సీఎం చంద్ర‌బాబు శ్రీకారం చుడుతున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు నేరుగా అన్నదాతల ఇళ్ల వద్దకే వెళ్లనున్నారు. ఈ సంద‌ర్భంగా ప్రభుత్వం గతంలో రైతుల కోసం చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్తులో ఏం చేయబోతోంది అనే అంశాలను రైతులకు వివరించనున్నారు.

అదేవిధంగా అధునాత‌న సాగు విధానాలు, సాంకేతికత వినియోగం, పురుగుమందుల వాడకంతో కలిగే నష్టాలు వంటి కీల‌క అంశాల‌ను వివరిస్తారు. అలాగే, నీటి భద్రత, ఆధునిక నీటిపారుదల పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. దీంతో పాటు, మార్కెట్‌లో డిమాండ్‌కు అనుగుణంగా ఉండే పంటలను సాగు చేయడం ద్వారా అధిక ఆదాయం పొందడంపై మార్గనిర్దేశం చేస్తారు. ఈ విధానాలు రైతులకు మెరుగైన దిగుబడులతోపాటు ఆదాయం పొందేందుకు దోహ‌ద‌ప‌డ‌నున్నాయ‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. త‌ద్వారా రైతుల ప‌క్ష‌పాతిగా త‌న‌ను తాను మార్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

Related Post