hyderabadupdates.com movies రామ్ ట్యాగ్ తీసేసుకున్న హీరో ఎవ‌రు?

రామ్ ట్యాగ్ తీసేసుకున్న హీరో ఎవ‌రు?

స్టార్ ఇమేజ్ అంటూ వ‌చ్చాక ఆ హీరో పేరు వెనుక ఏదో ఒక ట్యాగ్ ఉండాల్సిందే. ఆ హీరోకు అది న‌చ్చ‌క‌పోయినా సరే.. ద‌ర్శ‌క నిర్మాత‌లు, ఫ్యాన్స్ ఒత్తిడి చేసి అయినా ట్యాగ్ పెట్టించేస్తారు. ఐతే కొంద‌రు హీరోలు మారే ఇమేజ్‌కు అనుగుణంగా ట్యాగ్‌ల‌ను మార్చుకోవ‌డ‌మూ చూస్తుంటాం. ఒక‌సారి మార్చాక అది సూట్ కాలేద‌ని వెన‌క్కి వెళ్లిన సంద‌ర్భాలూ చూస్తున్నాం. ఇటీవ‌లే రామ్ చ‌ర‌ణ్ గ్లోబ‌ల్ స్టార్ ట్యాగ్ ప‌క్క‌న పెట్టి ఒక‌ప్ప‌టి మెగా ప‌వ‌ర్ స్టార్ ట్యాగ్‌కు మారిపోయాడు. మెగా అభిమానుల అభీష్టం మేర‌కే ఇలా చేసిన‌ట్లు క‌నిపిస్తోంది. 

అలాగే యంగ్ హీరో రామ్ సైతం కొన్నేళ్లుగా వాడుతున్న ఉస్తాద్ ట్యాగ్‌ను ఇటీవ‌ల విడిచిపెట్టేశాడు. ఒక‌ప్ప‌టి ఎన‌ర్జిటిక్ స్టార్ అనే ట్యాగే ఆంధ్ర కింగ్ తాలూకాలో చూడ‌బోతున్నాం. ఇలా ట్యాగ్స్ పెట్టుకోవ‌డం, మార్చుకోవ‌డం గురించి ఒక ఇంట‌ర్వ్యూలో రామ్ స్పందించాడు. బేసిగ్గా త‌న‌కు ఇలా పేరు వెనుక ట్యాగ్ పెట్టుకోవ‌డం ఇష్టం ఉండ‌ద‌ని అత‌ను స్ప‌ష్టం చేశాడు.

ఐతే కెరీర్ ఆరంభంలో అభిమానులు, త‌న నిర్మాత‌లు త‌న‌కూ ఒక ట్యాగ్ ఉండాల‌ని గ‌ట్టిగా చెప్పార‌ని.. దీంతో ఓకే అన్నాన‌ని.. వాళ్లంతా క‌లిసి త‌న‌కు ఒక ట్యాగ్ ఇచ్చార‌ని.. త‌న సినిమాల టైటిల్స్‌లో ఆ ట్యాగే వేశార‌ని.. అభిమానులు కూడా బేన‌ర్ల‌లో దాన్ని వాడేవార‌ని, కానీ ఆ ట్యాగ్ ను తాను తిరస్కరించినట్టు రామ్ తెలిపాడు. కానీ త‌ర్వాత ఇంకో హీరో ఆ ట్యాగ్‌ను వాడ‌డం మొద‌లుపెట్టాడ‌ని.. అ ట్యాగ్ అత‌ను తీసేసుకోవ‌డంతో తాను ఏమీ చేయ‌లేక సైలెంట్ అయిపోయాన‌ని రామ్ తెలిపాడు. ఆ హీరో ఎవ‌రు, ఆ ట్యాగ్ అంటే రామ్ స‌మాధానం ఇవ్వ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. ఆ ట్యాగ్ పోయాక ఫ్యాన్స్ త‌న‌ను వేరే బిరుదుతో పిల‌వ‌డం మొద‌లుపెట్టార‌ని అత‌ను చెప్పాడు. 

అభిమానుల అభిప్రాయం ప్ర‌కారం కెరీర్ ఆరంభంలో రామ్‌ను స్టైలిష్ స్టార్ అని పిలిచేవారు. అది త‌ర్వాత అల్లు అర్జున్‌కు వెళ్లిపోయింది. రామ్ ఎన‌ర్జిటిక్ స్టార్ అయ్యాడు. కానీ కొన్నేళ్ల ముందు బ‌న్నీ స్టైలిష్ స్టార్ ట్యాగ్ వ‌దిలేసి ఐకాన్ స్టార్ అయ్యాడు. ఇంకోవైపు రామ్ ఏమో ఎన‌ర్జిటిక్ స్టార్‌ను విడిచిపెట్టి ఉస్తాద్ అయ్యాడు. ఐతే ఈ టైటిల్ విష‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్ కొంచెం ఫీల‌య్యారు. పైగా ఉస్తాద్ ట్యాగ్ రామ్‌కు పెద్ద‌గా క‌లిసి రాలేదు. అందుకేనేమో రామ్ తిరిగి ఎన‌ర్జిటిక్ స్టార్ ట్యాగ్‌ను ఎంచుకున్న‌ట్లున్నాడు.

Related Post