అనస్వర రాజన్.. మలయాళ సినిమాలను ఫాలో అయ్యే వాళ్లకు ఈ పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. తన సినిమాలు ఒకట్రెండు చూసి ఉన్నా.. తనెంత టాలెంటెడో అర్థమైపోతుంది. టీనేజీలోనే నటిగా గొప్ప పేరు సంపాదించిందీ అమ్మాయి. ముఖ్యంగా లెజెండరీ నటుడు మోహన్ లాల్‌తో కలిసి నటించిన ‘నేరు’ సినిమాలో తన నటన అయితే అద్భుతమనే చెప్పాలి.
అంధురాలైన తనపై ఒక కుర్రాడు అత్యాచారం చేస్తే.. తనకున్న శిల్ప కళా నైపుణ్యంతో కోర్టులో పోరాడి నిందితుడిని పట్టించే పాత్రలో మైండ్ బ్లోయింగ్ పెర్ఫామెన్స్ ఇచ్చిందీ అమ్మాయి. తన ప్రతిభను గుర్తించి ఇప్పటికే తమిళంలోనూ అవకాశాలిచ్చారు. ఇప్పుడు అనస్వర తెలుగులోకి కూడా అడుగు పెడుతోంది. షార్ట్ ఫిలిమ్స్‌తో మంచి పేరు సంపాదించిన ప్రదీప్ అద్వైతం.. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిస్తున్న ‘ఛాంపియన్’ సినిమాలో అనస్వరను హీరోయిన్‌గా ఎంచుకుని తన అభిరుచిని చాటాడు.
క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానున్న ‘ఛాంపియన్’ నుంచి తాజాగా ‘గిర గిర’ అంటూ సాగే తొలి పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ ప్రోమోలోనే అనస్వర తన టాలెంట్ ఏంటో రుచి చూపించింది. తన హావభావాలు అదిరిపోయాయి. ఇక ఈ పాటలో అనస్వర లుక్.. తన డ్యాన్స్ అన్నీ కూడా ఆకట్టుకున్నాయి. అనస్వర టాలెంటుకు తగ్గట్లే ఈ పీరియడ్ ఫిలింలో పెర్ఫామెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్ర దక్కినట్లుంది. ఆమె ఫ్రేమ్‌లో ఉండగా తనకు దీటుగా నటించి మెప్పించడం రోషన్‌కు సవాలే.
ఈ సినిమాతో అనస్వర టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీనే ఇస్తుందని ఆశించవచ్చు. ఆమెతో టాలీవుడ్ హీరోయిన్లు జాగ్రత్తగా ఉండాల్సిందే. ముఖ్యంగా పెద్దగా పోటీ లేకుండా బోలెడన్ని అవకాశాలు అందుకుంటున్న శ్రీలీలకు అనస్వర నుంచి ముప్పు తప్పకపోవచ్చు. కాకపోతే అనస్వరకు గ్లామర్ పరంగా ఎక్కువ మార్కులు పడవు. ఆమె ఆ రకమైన పాత్రలు కూడా పెద్దగా చేయలేదు. కానీ పెర్ఫామెన్స్ విషయంలో మాత్రం ఆమె ఇక్కడి హీరోయిన్లకు సవాలు విసరడం ఖాయం.