ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్‌పై వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు ప్రభుత్వం అధికారికంగా సమాధానం చెప్పింది. ఆయన ఖర్చులను ఆయనే పెట్టుకుంటున్నారని.. సర్కారు ఖజానా నుంచి రూపాయి కూడా తీసుకోవడం లేదని వివరించింది. ఈ మేరకు సమాచార హక్కు చట్టం కింద ఓ వ్యక్తి అడిగిన వివరాలకు.. ప్రభుత్వం అధికారికంగా ఓ ప్రకటనలో వివరణ ఇచ్చింది. సదరు వ్యక్తికి సమాచారం కూడా పంపించింది.
ఏంటి విషయం!
మంత్రి నారా లోకేష్ వివిధ పనులపై దేశ వ్యాప్తంగా తిరుగుతున్నారు. అదేసమయంలో ఆయన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి ప్రాంతాలకు కూడా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు.. ఆయనపై విమర్శలు చేస్తున్నారు. నారా లోకేష్ ఈ 17 నెలల కాలంలో (కూటమి ప్రభుత్వం ఏర్పడి) 77 సార్లు విమానం ఎక్కి, దిగారని.. దీంతో ప్రజల సొమ్ముకు గండి పడుతోందని.. ఖజానా ఖాళీ అవుతోందని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేశారు.
తాజాగా ఇదే విషయంపై ఓ వ్యక్తి ఏపీ సమాచార శాఖకు సమాచార హక్కు చట్టం కింద.. నారా లోకేష్ ప్రయాణ వివరాలు.. ఎన్ని సార్లు విమానాన్ని వినియోగించారు? ఎంత ఖర్చయింది..? దీనిని ఏ ఖాతా కింద చెల్లించారు? అనే వివరాలు ఇవ్వాలని కోరారు. దీనికి స్పందించిన సమాచార శాఖ.. మంత్రి నారా లోకేష్ మూడు శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపింది.
విద్య, ఐటీ, ఆర్టీజీఎస్‌కు ఆయన మంత్రిగా ఉన్నారని పేర్కొంది. అయితే.. ఆయన విదేశీ ప్రయాణాలకు వినియోగించిన విమాన ఖర్చులను నారా లోకేష్ మంత్రిగా తనకు వస్తున్న జీతం నుంచే ఖర్చు చేసుకుం టున్నారని తెలిపింది. దీనిలో ప్రభుత్వ-ప్రజల సొమ్మును రూపాయి కూడా ఖర్చు చేయడం లేదని తాజా గా వివరణ ఇచ్చింది. అయితే.. నారా లోకేష్ ఎన్ని సార్లు విమాన ప్రయాణం చేశారన్న దానికి స్పందిస్తూ.. ప్రభుత్వ, ప్రజల అవసరాల కోసం.. మంత్రులు చేసే ప్రయాణాలకు నియంత్రణ ఉండదని పేర్కొంది.