మార్కెటింగ్ చేయడానికి కాదేది అనర్హం అని పెద్దలు ఊరికే అనలేదు. ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించేలా చేయడంలో చిన్న నిర్మాతలు అనుసరిస్తున్న ఎత్తుగడలు మాములుగా లేవు. గత వారం విడుదలై సంచలన విజయ అందుకున్న రాజు వెడ్స్ రాంబాయి వీక్ డేస్ లో కొంచెం నెమ్మదించిన మాట వాస్తవం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆక్యుపెన్సీలు తగ్గాయి. పైగా గురువారం ఆంధ్రకింగ్ తాలూకా ఉండటంతో మూవీ లవర్స్ దృష్టితో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ చూపు అటువైపు వెళ్తోంది. దీన్ని ఎదురుకోవడం కోసం రాజు వెడ్స్ రామ్ బాబు టీమ్ కొత్త ఎత్తుగడ వేసింది. అదే ఏపీ, రాయలసీమ మహిళలకు ఫ్రీ టికెట్లు.
రేపు లేడీస్ ఎవరైనా సరే ప్రొడక్షన్ హౌస్ ప్రకటించిన థియేటర్ల దగ్గరకు వెళ్లి కౌంటర్లో మొహం చూపిస్తే చాలు టికెట్ ఇచ్చేస్తారు. పైసా ఇవ్వక్కర్లేదు. ఎంత మంది అనే లిమిట్ లేదు. హౌస్ ఫుల్ అయ్యేదాకా తీసుకోవచ్చు. ఇదేదో బాగుంది కదూ. దీనికి అయ్యే ఖర్చు డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్లకు నిర్మాతలు చెల్లిస్తారు. అంటే ప్రమోషన్లకు పెట్టే సొమ్ములు ఈ విధంగా ప్రేక్షకులకే చేరుతాయి అన్నమాట. పాతిక దాకా థియేటర్లు వీటి కోసం సిద్ధం చేసి ఉంచారు. తెలంగాణలో ఎలాగూ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి అక్కడ అవసరం లేదనుకున్నారేమో కానీ ఇది మాత్రం తెలివైన స్ట్రాటజీ.
రాజు వెడ్స్ రాంబాయికి ఈ వారం చాలా కీలకం. వీలైనంత రాబట్టుకోవాలి. ఎందుకంటే డిసెంబర్ 5 అఖండ తాండవం వచ్చేస్తోంది. ముందు రోజు రాత్రి ప్రీమియర్లు వేస్తారు. బాలయ్య పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మొత్తం క్లాసు మాస్ తేడా లేకుండా కమ్మేస్తాడు. సో రాజు రాంబాయిలు ఫైనల్ రన్ కు వస్తారు. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దాటేసి పుష్కలంగా లాభాల్లోకి వెళ్లిపోయిన ఈ ఎమోషనల్ డ్రామాకు వీలైనంత ప్రమోషన్లు చివరి దాకా చేసేందుకు ప్రొడక్షన్ టీమ్ నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఆక్యుపెన్సీలు తక్కువగా ఉన్న ఏపీ, సీడెడ్లో ఫ్రీ బస్సు లాగా స్త్రీలకు ఫ్రీ టికెట్ల పధకం పెట్టారు. అయితే ఇది రేపొక్క రోజే సుమా.