తాటి చెట్టు కింద నిలబడి పాలు తాగుతున్నామన్న చందంగా వైసీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. తమ తప్పులు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేక పోతున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. సహజంగా ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలు కామనే అయినా.. హద్దులు మీరి చేస్తున్న విమర్శలు.. వివాదాలకు దారితీస్తున్నాయి. ఇవి ప్రత్యర్థులకు ఆటోమేటిక్‌గానే వరాలుగా మారుతున్నాయి. కానీ.. తమ తప్పులు తెలుసుకోవడంలో విఫలమవుతున్న వైసీపీ నాయకులు ఎదుటి వారిపై అక్కసు పెంచుకోవడం మరింత చిత్రంగాఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తరచుగా వైసీపీ నాయకుల వ్యవహార శైలిపై వ్యాఖ్యలు చేస్తున్నారు. వారిలా మనం ఉండొద్దు.. అని కూడా తన పార్టీ వారికి, పరోక్షంగా కూటమి నాయకులకు కూడా చెబుతున్నారు. తాజాగా కోనసీమ పర్యటనలోనూ.. పవన్ కల్యాణ్ ఇవే వ్యాఖ్యలు చేశారు. `బూతులు మన సంస్కృతి కాదు. దూకుడు కూడా మన పద్ధతి కాదు. అది వేరే పార్టీ సొంతం. వాటిని మీరు అనుకరించొద్దు“ అని జనసేన కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
దీనిపై వైసీపీ నాయకులు రుసరుసలాడుతున్నారు. కానీ, వాస్తవాలు మాత్రం కళ్ల ముందే కనిపిస్తున్నాయి. పార్టీ 11 స్థానాలకే గత ఎన్నికల్లో పరిమితమైనప్పటికీ.. నాయకులకు జ్ఞానోదయం కలగడం లేదని.. ఇటీవల ఆ పార్టీకే చెందిన కురువృద్ధనేత , మాజీ ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా జగన్‌ను కీర్తించేందుకు నాయకులు, వారి కీర్తనల కోసం జగన్ వెంపర్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో హద్దులు మీరిన విమర్శలు.. ప్రభుత్వాన్ని ప్రతి విషయంలోనూ టార్గెట్ చేస్తున్న స్ఫష్టమవుతోంది. దీని వల్ల ప్రయోజనం ఉంటుందా? అనేది ఆ పార్టీ నేతలు ఆలోచన చేయడం లేదు.
మరోవైపు.. అధికారంలో లేకపోయినా.. తప్పులు జరుగుతూనే ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేయడం వేరు. అధికారం పోయిన తర్వాత కూడా.. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ప్రమేయం ఉండడం.. తిరుమల తిరుపతి లడ్డూ వివాదాన్ని సర్ది చెప్పుకొనే పరిస్థితిని ఎదుర్కొనడం వంటివి పార్టీకి మచ్చలుగా మారుతున్నాయి. ఇక, రప్పా – రప్పా.. నరుకుతాం.. అనే డైలాగులు అన్ని చోట్లా కనిపిస్తున్నాయి. ఇవన్నీ.. పార్టీ పరంగా జరుగుతున్న తప్పులు. వీటినే పవన్ కల్యాణ్ ప్రస్తావిస్తున్నారు. సో.. వ్యవస్థాగతంగా జరుగుతున్న తప్పులను వైసీపీ గ్రహించకపోగా.. పవన్‌పై అక్కసు పెంచుకుంటే జరిగేది.. ఒరిగేదీ ఏమీ లేదని అంటున్నారు పరిశీలకులు.