hyderabadupdates.com movies మ‌ళ్లీ రౌడీ బేబీ జంట‌

మ‌ళ్లీ రౌడీ బేబీ జంట‌

సౌత్ ఇండియన్ సినిమా పాట‌ల్లో రౌడీ బేబీది ప్ర‌త్యేక‌మైన స్థానం. 2018లో వ‌చ్చిన మారి-2 మూవీలోని ఈ పాట యూట్యూబ్‌ను ఒక ఊపు ఊపేసింది. అందులో ధ‌నుస్‌, సాయిప‌ల్ల‌వి జోడీ కెమిస్ట్రీ, వాళ్లిద్ద‌రి డ్యాన్స్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. మారి-2 సినిమాలో పెద్ద‌గా విష‌యం లేక‌పోయినా బాగా ఆడిందంటే.. ఈ పాట ఓ ముఖ్య కార‌ణం. ధనుష్‌, సాయిప‌ల్ల‌విల న‌ట‌న కూడా సినిమాను కొంత‌మేర నిల‌బెట్టింది. ఐతే గ్రేట్ పెర్ఫామ‌ర్లు అయిన ధనుష్‌, సాయిప‌ల్ల‌విల కాంబినేష‌న్‌ను ఇంకా బెట‌ర్ స్టోరీలో చూడాల‌ని చాలామందికి అనిపించింది. 

మ‌ళ్లీ ఈ జంట క‌లిసి న‌టిస్తే చూడాల‌ని ఎప్ప‌ట్నుంచో వారి అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎట్ట‌కేల‌కు వ‌చ్చే ఏడాది ఈ ద్వ‌యాన్ని మ‌ళ్లీ వెండితెర‌పై చూడ‌బోతున్నాం. ధ‌నుష్ కొత్త సినిమాలో సాయిప‌ల్ల‌వి క‌థానాయికగా ఖ‌రారైంద‌న్న‌ది కోలీవుడ్ తాజా స‌మాచారం. ఈ ఏడాది ఇప్ప‌టికే కుబేర‌, ఇడ్లీ క‌డై సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు ధ‌నుష్‌. శుక్ర‌వారం బాలీవుడ్ మూవీ తేరే ఇష్క్ మేతో బాక్సాఫీస్ బ‌రిలో నిలుస్తున్నాడ‌త‌ను. ప్ర‌స్తుతం అత‌ను సూప‌ర్ హిట్ థ్రిల్ల‌ర్ మూవీ పోర్ తొళిల్‌తో ద‌ర్శ‌కుడిగా ఆక‌ట్టుకున్న విఘ్నేష్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. 

దీని త‌ర్వాత అమ‌ర‌న్ ద‌ర్శ‌కుడు రాజ్ కుమార్ పెరియ‌స్వామితో ఒక సినిమా చేయ‌డానికి అంగీకారం కుదిరింది. ఆ సినిమాకు సాయిప‌ల్ల‌విని క‌థానాయిక‌గా ఖ‌రారు చేశార‌ట‌. అమ‌ర‌న్ మూవీలో సాయిప‌ల్ల‌వి పాత్ర‌కు, న‌ట‌న‌కు ఎంతగా ప్ర‌శంస‌లు ద‌క్కాయో తెలిసిందే. ఈ సినిమా ఆమెతో పాటు రాజ్ కుమార్‌కూ గొప్ప పేరు తెచ్చిపెట్టింది. దీంతో త‌న త‌ర్వాతి సినిమాకూ సాయిప‌ల్ల‌వినే హీరోయిన్‌గా తీసుకుంటున్నాడు రాజ్ కుమార్.

విష‌యం ఉన్న ద‌ర్శ‌కుడితో ధ‌నుష్‌, సాయిప‌ల్ల‌వి లాంటి పెర్ఫామ‌ర్లు జ‌ట్టు క‌డితే ఓ మంచి సినిమాను ఆశించ‌వ‌చ్చు. ఈ సినిమాపై అంచ‌నాలు భారీగానే ఉంటాయి. ఈ చిత్రంలో రౌడీ బేబీ త‌ర‌హాలోనే మంచి డ్యాన్స్ నంబ‌ర్ కూడా ఉంటే క్రేజ్ ఇంకో లెవెల్‌కు చేర‌డం ఖాయం. ఇంకా మొద‌లు కాక‌ముందే ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తుండ‌డం విశేషం.

Related Post