తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తన పెద్దన్నగా పేర్కొనే ఏకైక నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ. గత 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. వాస్తవానికి కాంగ్రెస్‌కు.. మోడీకి మధ్య ఉన్న రాజకీయ వివాదాలు, విభేదాల గురించి అందరికీ తెలిసిందే. నిరంతరం విమర్శించుకోవడం, ఎద్దేవా చేసుకోవడం కామనే. అయితే.. ఆ విభేదాల జోలికి పోకుండా.. ప్రధానిని మచ్చిక చేసుకునే క్రమంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా లౌక్యం ప్రదర్శిస్తున్నారు.
బహిరంగ వేదికపైనే ప్రధాని సమక్షంలో ఆయనను `పెద్దన్న`గా సంబోధించారు. ఈ క్రమంలో ఎప్పుడు ప్రధానిని కలిసినా.. పెద్దన్నను కలిసి వచ్చానంటూ.. జాతీయ మీడియా ముందు రేవంత్ చెప్పడం కూడా గుర్తుండే ఉంటుంది. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న రేవంత్.. ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ఇలా.. పార్టీ పరంగా బీజేపీతో రాజకీయ విభేదాలు ఉన్నా.. ముఖ్యమంత్రిగా కేంద్రంతో మాత్రం సీఎం రేవంత్ అన్యోన్య సంబంధాలు కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నారు.
ఈ క్రమంలో తాజాగా.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల 8. 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వ హించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధానిని ఆహ్వానించాలని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రతిపాదించారు. అంతేకాదు.. ప్రధానితోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టించాలని.. ప్రారంభించాలని కూడా ప్రతిపాదించారు. దీనికి మంత్రివర్గం ఓకే చెప్పింది. ఈ నేపథ్యంలో ఆహ్వాన ప్రతులను రెడీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి ప్రధానిని స్వయంగా కలిసి ఆహ్వానించాలని నిర్ణయించారు.
నాలుగు రోజుల్లో భారీ ఏర్పాట్లు..
ఈ సదస్సుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి భారీ లక్ష్యాలనే నిర్దేశించారు. ఏర్పాట్లు అధిరిపోవాలని.. తెలంగాణ సంస్కృతి కనిపించాలని సూచించారు. 4 వేల మంది అతిథులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆమేరకు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి విషయాన్నీ సీరియస్‌గా తీసుకోవాలని పేర్కొన్నారు. సీనియర్ ఐఏఎస్‌లు బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. సదస్సులో ప్రసంగించే వారికి సంబంధించిన పక్కా ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేలా డ్రోన్ షో, కల్చరల్ యాక్టివిటీ ఉండాలని తెలిపారు. ఈ మొత్తం కార్యక్రమాలను నాలుగు రోజుల్లోనే పూర్తి చేయాలని చెప్పారు.