hyderabadupdates.com movies గ్రీన్ కార్డులపై ట్రంప్ మరో పోటు… మనోళ్లపై ఎఫెక్ట్ ఉంటుందా?

గ్రీన్ కార్డులపై ట్రంప్ మరో పోటు… మనోళ్లపై ఎఫెక్ట్ ఉంటుందా?

అమెరికాలో వైట్ హౌస్ సమీపంలో జరిగిన కాల్పుల ఘటన ఆ దేశాన్ని కుదిపేసింది. ఒక ఆఫ్ఘన్ జాతీయుడు ఇద్దరు నేషనల్ గార్డ్స్‌పై కాల్పులు జరపగా, అందులో ఒకరు మరణించారు. ఈ ఘటనతో ట్రంప్ ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే వలసదారులపై, ముఖ్యంగా గ్రీన్ కార్డుదారులపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. దేశ భద్రతే తమకు ముఖ్యమని, దీని కోసం ఎంత దూరమైనా వెళ్తామని స్పష్టం చేసింది.

ఈ ఘటనకు రియాక్షన్‌గా యూఎస్ పౌరసత్వ, వలస సేవల సంస్థ (USCIS) సంచలన నిర్ణయం తీసుకుంది. “ఆందోళనకర దేశాల” నుంచి వచ్చిన ప్రతి ఒక్కరి గ్రీన్ కార్డును జల్లెడ పట్టాలని నిర్ణయించింది. గతంలో జారీ చేసిన కార్డులను కూడా క్షుణ్ణంగా రీ ఎగ్జామిన్ చేయనున్నారు. బైడెన్ హయాంలో పాటించిన “అజాగ్రత్త పునరావాస విధానాల” వల్లే ఇలాంటి ముప్పు వచ్చిందని ప్రస్తుత ప్రభుత్వం మండిపడుతోంది.

అయితే, ఈ వార్త వినగానే అమెరికాలోని భారతీయులు కాస్త కంగారు పడ్డారు. కానీ, ఊపిరి పీల్చుకునే విషయం ఏంటంటే.. ఈ నిబంధనల వల్ల భారతీయులకు ఎలాంటి ప్రమాదం లేదు. ఈ క్రాక్‌డౌన్ కేవలం 19 ‘హై రిస్క్’ దేశాలకే పరిమితం. ఇందులో ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, యెమెన్, వెనిజులా, సుడాన్ వంటి దేశాలు ఉన్నాయి తప్ప, ఇండియా పేరు లేదు. కాబట్టి మనవాళ్ళు సేఫ్.

కాల్పులు జరిపిన వ్యక్తి 2021లో అమెరికా బలగాలు ఆఫ్ఘనిస్తాన్ వదిలి వెళ్ళినప్పుడు, బైడెన్ ప్రభుత్వం చేపట్టిన పునరావాస కార్యక్రమంలో భాగంగా అమెరికా వచ్చాడు. ఇలా వచ్చిన వారిలో ఇంకా ఎంతమంది ప్రమాదకరమైన వ్యక్తులు ఉన్నారో అని ట్రంప్ సర్కార్ అనుమానిస్తోంది. అందుకే ఆయా దేశాల నుంచి వచ్చిన వారి రికార్డులను మళ్ళీ తిరగేస్తున్నారు.

ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులతో పాటు, కొత్తగా వచ్చే వాటికి కూడా ఈ కఠిన నిబంధనలు వర్తిస్తాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఇమ్మిగ్రేషన్ రూల్స్ మారుతాయని ఊహించినా, ఈ ఘటనతో అది మరింత వేగవంతమైంది. అమెరికన్ల భద్రత విషయంలో రాజీపడేది లేదని ఈ చర్య ద్వారా వైట్ హౌస్ గట్టి సంకేతాలు పంపింది.

Related Post