భారత ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోంది. అంచనాలకు మించి రాణించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా విడుదలైన ప్రభుత్వ డేటా ప్రకారం, జులై సెప్టెంబర్ త్రైమాసికం (Q2)లో ఇండియా జీడీపీ ఏకంగా 8.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇది గత ఆరు త్రైమాసికాల్లోనే అత్యధికం కావడం విశేషం. జీఎస్టీ రేట్ల తగ్గింపు వల్ల వినియోగం పెరుగుతుందని ఊహించి ఫ్యాక్టరీలు భారీగా ఉత్పత్తులను పెంచడం వల్లే ఈ అద్భుతమైన గ్రోత్ సాధ్యమైంది.
ముఖ్యంగా మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఈసారి హీరోగా నిలిచింది. దేశ జీడీపీలో 14 శాతం వాటా ఉన్న ఈ రంగం, ఈ క్వార్టర్లో ఏకంగా 9.1 శాతం వృద్ధిని సాధించింది. పోయిన ఏడాది ఇదే సమయంలో ఇది కేవలం 2.2 శాతంగా ఉండేది. అంటే ఏ రేంజ్లో పుంజుకుందో అర్థం చేసుకోవచ్చు. గత త్రైమాసికంలో (ఏప్రిల్ జూన్) 7.8 శాతంగా ఉన్న వృద్ధి రేటు, ఇప్పుడు 8.2 శాతానికి చేరడం భారత ఆర్థిక పటిష్టతకు నిదర్శనం. నామినల్ జీడీపీ కూడా 8.7 శాతం గ్రోత్ రేట్ నమోదు చేసింది.
ఈ ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఫుల్ ఖుషీ అయ్యారు. “ఇది చాలా ప్రోత్సాహకరమైన ఫలితం. మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ప్రజల కష్టానికి ఇది నిదర్శనం” అని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. సంస్కరణలను కొనసాగిస్తూనే, సామాన్యుడి జీవన ప్రమాణాలను పెంచడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
అయితే, అసలు టార్గెట్ ఇక్కడితో అయిపోలేదు. 2047 నాటికి భారత్‌ను ‘విక్షిత్ భారత్’ (అభివృద్ధి చెందిన దేశం)గా మార్చాలనేది పెద్ద కల. ఈ కల నిజం కావాలంటే, రాబోయే రెండు దశాబ్దాల పాటు మనం సగటున 8 శాతం వృద్ధి రేటును మెయింటైన్ చేయాల్సి ఉంటుందని ఎకనామిక్ సర్వే చెబుతోంది. వరల్డ్ బ్యాంక్ కూడా ఇదే మాట చెప్పింది. వచ్చే 22 ఏళ్ల పాటు ఇండియా కనీసం 7.8 శాతం వృద్ధి సాధిస్తేనే మనం అనుకున్న ఆ సూపర్ పవర్ స్టేటస్ దక్కుతుంది.
ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉన్న భారత్, ఇప్పుడు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. గత పదేళ్లలో ఎన్నో దేశాలను వెనక్కి నెట్టి మనం ఈ స్థాయికి వచ్చాం. ఇప్పుడు మన ముందున్న సవాలు.. తలసరి ఆదాయాన్ని కూడా పెంచుకోవడం. ఈ 8.2% గ్రోత్ రేట్ చూస్తుంటే, భారత్ సరైన ట్రాక్‌లోనే వెళ్తోందని, భవిష్యత్తులో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.