ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారానే పదువులు సొంతం అవుతాయి. ప్రజాప్రతినిధిగా ఉండేందుకు ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించే ఎన్నికల్లో పోటీ చేసి వారి ఆదరణను నాయకులు చూరగొనాలి. ఎంపీ నుంచి ఎమ్మెల్యే వరకు, కార్పొరేటర్ నుంచి వార్డు సభ్యుడి దాకా అంతా ఎన్నికల ప్రక్రియపైనే ఆధారపడి ఉంటుంది. అయితే.. తాజాగా తెలంగాణలో కొత్త సంస్కృతి పురుడు పోసుకుంది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలకు ఇక్కడ రంగం కొనసాగుతోంది. నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది.
వచ్చే నెలలో మూడు విడతలుగా.. పోలింగ్ జరగనుంది. కానీ..ఇంతలోనే సర్పంచ్ పదవుల కోసం డబ్బులు వెదజల్లే సంస్కృతి తెరమీదికి వచ్చింది. ఈ పదవులు దక్కించుకునేందుకు వేలం పాటలు నిర్వహించి.. ఎవరు ఎక్కువ మొత్తానికి పాడుకుంటే వారికి ఆయా పదవులు కట్టబెడుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో జరిగిన ఘటన చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఇలా పాడుకుని.. పదవి దక్కించుకున్నా.. అది ఎంత మేరకు ఎన్నికల ప్రక్రియ ముందు నిలుస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండలం జోగుగూడెం గ్రామ పంచాయతీ సర్పంచి పదవికి శుక్రవారం బహిరంగ వేలం వేశారు. దీనిలో ఏడుగురు వ్యక్తులు సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. ఈ క్రమంలో రూ. లక్షతో ప్రారంభమైన పాట..రూ20 లక్షల 5 వేల 116 వరకు చేరింది. ఈ మేరకు అధిక మొత్తంతో పాట పాడిన వ్యక్తిని గ్రామస్థులు.. సర్పంచ్‌గా అంగీకరించారు. ఇక, ఈ మొత్తాన్ని ఎన్నికలు జరిగేలోపు మూడు విడతలుగా సదరు వ్యక్తి జమ చేయాల్సి ఉంటుంది. ఈ నిధులతో ఆలయాన్ని కడతామని స్థానికులు తెలిపారు.
చెల్లుతుందా?
ప్రజాస్వామ్యంలో పదవులు కొనుగోలు చేయడం అనేది చెల్లదు. పైగా రాజ్యాంగంలోని 73, 74 రాజ్యాంగ సవరణలు పూర్తిగా గ్రామ పంచాతీయల కార్యక్రమాలను, నిర్మాణాన్ని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రక్రియలు రాజ్యాంగ బద్ధం కావు. సో.. ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఇప్పుడు వేలం పాట జరిగిన జోగుగూడెం గ్రామంలోనూ పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. అయితే.. ఓటర్లు వేసే ఓటు కీలకంగా మారనుంది. అయితే.. ఇప్పుడు వేలం నిర్వహించిన నేపథ్యంలో ఓటర్లు `కట్టుబాటు`కు లోబడి ఓటు వేయనున్నారు.