సూపర్ స్టార్ మహేష్ బాబు, అగ్ర దర్శకుడు సుకుమార్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన 1 నేనొక్కడినే సినిమాపై విడుదలకు ముందు అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలిసిందే. ఇద్దరూ కలిసి ఇండస్ట్రీ హిట్‌ను డెలివర్ చేస్తారని అభిమానులు ఆశించారు. కానీ తెలుగు సినీ చరిత్రలోనే అత్యధిక నష్టాలు తెచ్చి పెట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలిచిందా చిత్రం. అలా అని అది పేలవమైన సినిమా ఏమీ కాదు. కంటెంట్ పరంగా హాలీవుడ్ రేంజ్ ఉంటుంది.
కానీ ఈ సినిమా కథ గురించి ప్రేక్షకులు ఏవో అంచనాలు పెట్టుకుంటే.. తెర మీద ఇంకేదో కథ కనిపించింది. మానసిక సమస్యలున్న పాత్రలో మహేష్ బాబును చూసి అభిమానులు తట్టుకోలేకపోయారు. థియేటర్లలో చూసినపుడు ఆ సినిమా చాలామందికి అర్థం కాలేదు కూడా. కానీ ఓటీటీలోకి వచ్చాక అది కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. 1 నేనొక్కడినే ఇప్పుడొస్తే పెద్ద హిట్టవుతుందేమో అనే అభిప్రాయాలు చాలామందిలో ఉన్నాయి. ఐతే ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన రామ్ ఆచంట మాత్రం ఆ అభిప్రాయంతో విభేదించాడు
1 నేనొక్కడినే ఎలాంటి సినిమానో ప్రేక్షకులకు ఐడియా ఇవ్వకుండా రిలీజ్ చేయడం తాము చేసిన అతి పెద్ద తప్పు అని రామ్ ఆచంట అభిప్రాయపడ్డాడు. ఇదేదో జేమ్స్ బాండ్ తరహా యాక్షన్ మూవీ అనే అంచనాతో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారని.. కానీ అందులో కథ వేరుగా ఉండడం.. హీరోకు ఏదో ప్రాబ్లం ఉన్నట్లు చూపించడంతో ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారని రామ్ అన్నాడు. బెనిఫిట్ షోలు చూసిన మహేష్ అభిమానులకే ఈ సినిమా నచ్చలేదని.. బాగా నెగెటివ్‌గా స్పందించారని.. ఆ ప్రభావం సామాన్య ప్రేక్షకుల మీదా పడి సినిమా ఫ్లాప్ అయిందని ఆయనన్నాడు.
ఈ సినిమా కథేంటో ముందే ప్రేక్షకులకు హింట్ ఇవ్వకపోవడం తప్పయిందా అని ఆ టైంలోనే తామంతా చర్చించుకున్నామని రామ్ తెలిపాడు. ఇప్పుడు ఆ సినిమా వస్తే మంచి ఫలితం అందుకునేదా అని అడిగితే.. అదే ట్రైలర్, ప్రోమోలతో సినిమాను ప్రమోట్ చేసి సినిమాను రిలీజ్ చేస్తే ఇప్పుడు కూడా సినిమాకు అదే రిజల్ట్ వస్తుందని ఆయనన్నాడు. ఈ సినిమా కథ ఇది అని ముందే ప్రేక్షకులను ప్రిపేర్ చేస్తే తప్ప రిజల్ట్ మారదని ఆయన స్పష్టం చేశాడు.