స్మార్ట్‌ఫోన్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ఇకపై ఫోన్లో సిమ్ కార్డు లేకుండా వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్ లాంటి మెసేజింగ్ యాప్స్ వాడటం కుదరదు. సైబర్ నేరాలను అరికట్టేందుకు టెలికాం శాఖ (DoT) సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్తగా జారీ చేసిన నిబంధనల ప్రకారం.. మీ ఫోన్లో ‘యాక్టివ్ సిమ్’ ఉంటేనే ఆ యాప్స్ పనిచేస్తాయి. సిమ్ తీసేసి, కేవలం వైఫైతో వాట్సాప్ నడిపిస్తానంటే ఇక కుదరదు.
ఇప్పటివరకు మనం ఒక ఫోన్లో సిమ్ వేసి వాట్సాప్ రిజిస్టర్ చేసుకుని, ఆ తర్వాత సిమ్ తీసేసినా లేదా వేరే ఫోన్లో ఉన్న సిమ్ నంబర్‌తో ఇంకో డివైజ్‌లో వాట్సాప్ వాడుకునేవాళ్లం. కానీ ఇప్పుడు వచ్చిన “సిమ్ బైండింగ్” రూల్ ప్రకారం.. వాట్సాప్ రన్ అవుతున్న డివైజ్‌లోనే ఆ నంబర్ సిమ్ కచ్చితంగా ఉండాలి. సిమ్ లేకపోతే యాప్ ఓపెన్ కాదు. ఈ రూల్స్ తక్షణమే అమల్లోకి వచ్చాయని, యాప్స్ అన్నీ 90 రోజుల్లో దీన్ని పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ ప్రభావం వాట్సాప్ వెబ్ వెర్షన్ మీద కూడా గట్టిగానే పడబోతోంది. ఆఫీసుల్లో సిస్టమ్స్‌లో వాట్సాప్ లాగిన్ చేసి వదిలేయడం ఇక కుదరదు. కొత్త రూల్స్ ప్రకారం, వెబ్ వెర్షన్ ప్రతి 6 గంటలకు ఒకసారి ఆటోమేటిక్‌గా లాగౌట్ అయిపోతుంది. మళ్లీ వాడాలంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రీ లింక్ చేసుకోవాల్సిందే. సెక్యూరిటీ పరంగా ఇది మంచిదే అయినా, రోజూ ఆఫీసుల్లో వాట్సాప్ వాడే యూజర్లకు మాత్రం ఇది కొంచెం తలనొప్పే.
కేంద్రం ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం పెరిగిపోతున్న సైబర్ నేరాలే. చాలామంది నేరస్థులు, ముఖ్యంగా దేశం బయట ఉన్నవాళ్లు.. భారతీయ నంబర్లతో వాట్సాప్ అకౌంట్లు క్రియేట్ చేసి, ఆ తర్వాత సిమ్ లేకుండానే యాప్స్ వాడుతూ భారీ మోసాలకు పాల్పడుతున్నారు. సిమ్ ఆ ఫోన్లో లేకపోవడం వల్ల వారిని ట్రాక్ చేయడం పోలీసులకు కష్టంగా మారుతోంది. ఈ లొసుగును అడ్డుకోవడానికే ప్రభుత్వం ఈ సీరియస్ స్టెప్ తీసుకుంది. ఈ కొత్త నిబంధనలను పాటించడానికి వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి సంస్థలకు 120 రోజుల గడువు ఇచ్చారు. ఈ లోపు వారు టెక్నికల్ మార్పులు చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాలి. టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023 ప్రకారం ఇది తప్పనిసరి. రాబోయే మూడు నెలల్లో మన వాట్సాప్ వాడే పద్ధతి పూర్తిగా మారిపోబోతోందన్నమాట.