జయలలిత, కరుణానిధిల మరణానంతరం తమిళనాట రాజకీయ శూన్యత నెలకొన్న సమయంలో ఎన్నో అంచనాల మధ్య మక్కల్ నీది మయం పేరుతో కొత్త పార్టీ పెట్టి రాజకీయాల్లో అడుగు పెట్టారు లోక నాయకుడు కమల్ హాసన్. కానీ ఆ అంచనాలను కమల్ ఏమాత్రం అందుకోలేక పోయారు. తొలి ఎన్నికల్లోనే ఆయన పార్టీ తుడిచి పోయిన పరిస్థితి. అలా అని తన పార్టీని కమల్ ముసేయలేదు. మొక్కుబడిగా నడిపిస్తున్నారు. అధికార డీఎంకే పార్టీకి ఆయన సానుభూతిపరుడిగా మారారు. ఆ పార్టీ మద్దతుతో రాజ్యసభ సభ్యుడు కూడా అయ్యారు.
అయితే కొత్తగా తమిళ్ వెట్రి కలగం పేరుతో పార్టీ పెట్టి వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడబోతున్న విజయ్ విషయంలో కమల్ స్టాండ్ ఏంటి అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. కరూర్ తొక్కిసలాట విషాద సమయంలో ఆయన విజయ్ కి మద్దతుగానే నిలిచారు. మరి ఎన్నికల సమయంలో కమల్.. విజయ్ పట్ల ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరం. తన పార్టీని ఒకసారి ఎన్నికల బరిలో నిలిపిన అనుభవంతో విజయ్ కి ఏమైనా సలహా ఇస్తారా అని తాజాగా ఆయన్ని విలేకరులు ప్రశ్నించారు.
దానికి ఆయన బదులిస్తూ.. “అనుభవం మన కన్నా గొప్ప గురువు. అది నేర్పే పాఠాలు ఎవరూ నేర్పించలేరు. మనుషులకు పక్షపాతం ఉండొచ్చు గానీ అనుభవానికి ఉండదు. విజయ్ నాకు సోదరుడు లాంటి వ్యక్తి. అలాంటి విజయ్‌కు సలహా ఇచ్చేందుకు ఇది సరైన సమయం కూడా కాదు” అని కమల్ బదులిచ్చారు. కమల్ మద్దతుగా నిలుస్తున్న డీఎంకే పార్టీని విజయ్ ప్రధాన ప్రత్యర్థిగా ప్రకటించుకున్నాడు. మరి మీ ప్రత్యర్థి ఎవరు అని కమల్ ను అడిగితే.. “నాకు ఏ పార్టీ శత్రువు కాదు. నాకు కులతత్వమే ప్రధాన శత్రువు. దాని మీదే నా పోరాటం” అని సమాధానం ఇచ్చాడు కమల్.