జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. “నా మిత్రుడు..“అంటూ ఆయనను సంబోధించారు. తరచుగా ఈ వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈసారి మరింత నొక్కి చెప్పారు. `నామిత్రుడు నేను.. నిరంతరం ఒకే విధంగాఆలోచన చేస్తున్నాం. ప్రజలకు మేలు చేసేందుకు ఉన్న ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటున్నాం. ఇద్దరం కూడా.. పేదల కోసం చర్చిస్తాం. ప్రజల మంచి చెడులపై నిరంతరం ఆలోచన చేస్తాం.“ అని చెప్పారు. ఇద్దరి పార్టీలు వేరైనా.. ఆలోచనలు మాత్రం ఒక్కటేనని తేల్చి చెప్పారు.
రాష్ట్రంలో ఇంకా ఆర్థిక సమస్యలు ఉన్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు. వైసీపీ హయాంలో ప్రతి దానినీ అమ్మేశారని.. మద్యం పై 25 ఏళ్ల ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని చెప్పారు. వాటిని సరిదిద్దుతూనే.. ప్రస్తుతం ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. పేదలు పేదలుగా మిగిలిపోకూడదని.. వారిని అభివృద్ధి చేయాలని నా మిత్రుడు నేను అనేక ఆలోచనలు చేస్తున్నాం. దీనిలో రాజీ పడే ప్రసక్తే లేదు. ఇప్పటికే 23 లక్షల కోట్ల రూపాయల మేరకు పెట్టుబడులు తీసుకువచ్చాం. త్వరలోనే అవి సాకారం(గ్రౌండింగ్) కానున్నాయి. తద్వారా లక్షల మందికి ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయన్నారు.
జనాభాను పెంచండి!
రాష్ట్రంలో జనాభాను పెంచాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు మరోసారి చెప్పారు. లేకపోతే.. రాబోయే రోజుల్లో మిషన్లతో పనులు చేయించుకోవాల్సి ఉంటుందన్నారు. ఎంత మంది పిల్నల్ని కన్నా.. ప్రభుత్వం అండగా ఉంటుందని.. తల్లికి వందనం అమలు చేస్తామని తెలిపారు. అదేసమయంలో నలుగురు పిల్లలను కనే కుటుంబాలకు మరింత ఆర్థిక సాయం చేస్తామని వివరించారు. ఇదేసమయంలో వైసీపీ పైనా నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం 250 రూపాయల పింఛను పెంచేందుకు అనేక వంకలు చెప్పిందన్న ఆయన.. తాము రాగానే రూ.4000 మేరకు పింఛన్లను పెంచి అమలు చేస్తున్నామన్నారు. ఇదీ.. గత ప్రభుత్వానికితమకు తేడా అని వివరించారు.
రైతులను మోసం చేశారు..
గత వైసీపీ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసిందని.. సీఎం చంద్రబాబు చెప్పారు. 1650 కోట్ల రూపాయల మేరక రైతులకు బకాయిలు పెట్టి వెళ్లారని.. వాటిని విడతల వారీగా తాము తీరుస్తున్నట్టు చెప్పారు. ఇప్పుడు ధాన్యాన్ని కొనుగోలు చేసిన వెంటనే నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్టు వివరించారు. స్త్రీ శక్తి పథకంలో ఇప్పటి వరకు 25 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు పథకాన్ని వినియోగించుకున్నారని సీఎం చెప్పారు. కూటమి ప్రభుత్వం ఉంటే.. ప్రజలకు సుపరిపాలన చేరువ అవుతుందన్నారు.