వైసీపీ తరఫున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేల్లో జగన్ ఒకరు. మిగిలిన 10 మంది ఇతర నియోజకవర్గాల్లో విజయం దక్కించుకున్నారు. వీరిలో కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి వంటి సీనియర్లు ఉన్నారు. అయితే.. ఈ పది మంది ఏం చేస్తున్నారు? పార్టీ లైన్‌లోనే నడుస్తున్నారా? లేక వేర్వేరు పనులు పెట్టుకున్నారా? అనేది వైసీపీలో తరచుగా చర్చకు వస్తోంది. అంతర్గత వ్యవహారాలు ఎలా ఉన్నా.. పార్టీ పరంగా వారు చేస్తున్న పనులను ప్రస్తావిస్తున్నారు.
ఈ క్రమంలో చాలా మంది ఎమ్మెల్యేలు సొంత పనులు చేసుకుంటున్నారు. ఎవరికి వారు వారి వారి సొంత పనుల్లో నిమగ్నమవుతున్నారు. ఈ పరిణామం.. వైసీపీకి ఇబ్బందిగా మారింది. తాజాగా ఈ వ్యవహారంపైనే జగన్ ఫోకస్ పెట్టారు. జనవరి నుంచి జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్న దరిమిలా.. నియోజకవర్గాల్లో గ్రాఫ్‌పై వైసీపీ దృష్టి పెట్టింది. అధికారం లేకపోయినా.. ప్రజలను కలుసుకునేందుకు ఎంత మంది ప్రాధాన్యం ఇస్తున్నారన్న చర్చ చేపట్టింది.
ఈ క్రమంలోనే క్రిస్టమస్ తర్వాత.. ఎమ్మెల్యేలతో చర్చించేందుకు జగన్ సిద్ధమయ్యారు. నియోజకవర్గాల్లో సమస్యలు, ప్రజలకు చేరువ అవుతున్నతీరు.. ఎమ్మెల్యేల పనితీరు.. ఇలా అన్ని కోణాల్లోనూ ఆయన దృష్టి పెట్టనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. “పట్టు బిగిస్తున్నాం. ఎవరినీ జగన్ వదిలి పెట్టరు. అందరితోనూ చర్చించేందుకు టైంటేబుల్ రెడీ అవుతోంది.” అని వైసీపీకి చెందిన కీలక నాయకుడు ఒకరు చెప్పారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలపై ఎక్కువగా దృష్టి పెట్టనున్నట్టు సమాచారం.
మొత్తంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేసేందుకు జగన్ ప్రాధాన్యం ఇచ్చారు. ప్రధానంగా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో.. ఎమ్మెల్యేలు ఇతర పార్టీ నేతలతో కలివిడిగా ఉంటున్నారని.. వ్యాపారాలు వ్యవహారాల్లో తలమునకలయ్యారన్న వాదన కూడా ఉంది. ఇలాంటి వారికి జగన్ క్లాస్ ఇచ్చే అవకాశం ఉంది. అదేసమయంలో తమ ప్రమేయం లేకుండానే తమపై వ్యతిరేక వార్తలు వస్తున్నాయని చెబుతున్న వారి పై కూడా ఇటీవల కాలంలో వైసీపీ దృష్టి పెట్టింది. దీంతో ఆయా నియోజకవర్గాల పనితీరును కూడా పరిశీలించనున్నారు. మొత్తంగా ఈ చర్చలతో వైసీపీ ఎమ్మెల్యేలను దారిలోకి తీసుకువచ్చే పనిని ప్రారంభించారు.