hyderabadupdates.com movies వీటి సంగతేంటి: కేసీఆర్ మరిచిపోయారా? కావాలనే వదిలేశారా?

వీటి సంగతేంటి: కేసీఆర్ మరిచిపోయారా? కావాలనే వదిలేశారా?

బీఆర్ ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీపై పార్టీ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో పార్టీలోనూ, బయటా చోటు చేసుకున్న పరిణామాలపై కేసీఆర్ స్పందిస్తారని అందరూ భావించారు. అంతేకాదు, ఈ అంశాలపై పార్టీకి స్పష్టమైన దిశానిర్దేశం ఇస్తారని అంచనా వేశారు.

కానీ కేసీఆర్ మాత్రం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కీలక అంశాలను పూర్తిగా పక్కనపెట్టారు. దీంతో ఆయా విషయాలను ఉద్దేశపూర్వకంగానే వదిలేశారా? లేక మరిచిపోయారా? అనే ప్రశ్న సొంత పార్టీ నేతల్లోనే చర్చనీయాంశంగా మారింది.

ప్రస్తావించని అంశాలు

1) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ ఎస్ తన సిట్టింగ్ సీటును కోల్పోయింది. దీనిపై కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇది సిట్టింగ్ సీటు కావడం, మొదటి రోజు నుంచి కేసీఆర్ స్వయంగా పర్యవేక్షించడం, మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకు టికెట్ ఇవ్వడం నుంచి ప్రచారం వరకు అన్నీ ఆయనే చూసుకోవడం తెలిసిందే. అయినా ఓటమి ఎదురైంది. ఎందుకు ఓడారు? బాధ్యత ఎవరిది? అనే అంశాలపై స్పందిస్తారని భావించినా కేసీఆర్ మౌనం పాటించారు.

2) తనయ కవిత అంశంకేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కవిత వ్యవహారం పార్టీలో తీవ్ర చర్చకు కారణమైంది. అంతర్గత సమావేశాల్లో ఈ విషయంపై ఎవ్వరూ మాట్లాడొద్దని కేసీఆర్ ముందే సూచించారు. అయినా తాజా సమావేశంలో అయినా స్పందిస్తారేమో అనుకున్నారు. కానీ కవిత పేరు కూడా ప్రస్తావించకుండా సమావేశాన్ని ముగించారు.

3) జల వివాదాలుఇటీవల అంతర్గత సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. కృష్ణా, గోదావరి జలాలను ఏపీకి దోచి పెడుతున్నారని ఆరోపించారు. ఉద్యమానికి సిద్ధం కావాలని కూడా పార్టీ నేతలకు చెప్పారు. త్వరలో పెద్ద పోరాటం ఉంటుందని సంకేతాలిచ్చారు. కానీ తాజా సమావేశంలో ఈ అంశంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

4) మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరు మార్పుకేంద్ర ప్రభుత్వం పథకం పేరు మార్చిన అంశంపై కూడా కేసీఆర్ మౌనం వహించారు. గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు గాంధీ కాదు, బాపూజీ లేదా మహాత్మా అని పేరు పెట్టాలని సూచించిన వ్యక్తి కేసీఆర్. ఇప్పుడు పూర్తిగా గాంధీ పేరు తొలగించినా విమర్శలు చేయలేదు. దీనిపై స్పందిస్తారని భావించినా నిరాశే మిగిలింది.

5) బీజేపీ బీఆర్ ఎస్ కూటమి ఆరోపణలుజూబ్లీహిల్స్ ఎన్నికల నుంచి పంచాయతీ ఎన్నికల వరకు కాంగ్రెస్ నేతలు బీజేపీ బీఆర్ ఎస్ లోపలి పొత్తు అంటూ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే విమర్శలు చేశారు. తాజా సమావేశంలో దీనిపై కేసీఆర్ స్పష్టత ఇస్తారని బీఆర్ ఎస్ నేతలు భావించారు. కానీ ఈ అంశాన్నీ పూర్తిగా వదిలేశారు.

6) హరీష్ రావు అంశంఇటీవల హరీష్ రావును కేంద్రంగా చేసుకుని కాంగ్రెస్ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. బీఆర్ ఎస్ ను చీలుస్తారని, ఆయన బయటకు వస్తారని కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ అంశంపై కేసీఆర్ స్పష్టత ఇస్తారని అందరూ ఎదురుచూశారు. కానీ ఈ విషయంపైనా మౌనమే కొనసాగింది.

ఇన్ని కీలక అంశాలను ప్రస్తావించకుండా వదిలేయడంతో, కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించారా? లేక ఉద్దేశపూర్వకంగా ఈ విషయాలను పక్కనపెట్టారా? అన్నదే ఇప్పుడు బీఆర్ ఎస్ వర్గాల్లో ప్రధాన చర్చగా మారింది.

Related Post

Bandla Ganesh Clarifies Remarks After K Ramp Success Meet ControversyBandla Ganesh Clarifies Remarks After K Ramp Success Meet Controversy

Actor and producer Bandla Ganesh has issued a clarification following the controversy surrounding his speech at the K Ramp movie success meet. His remarks during the event had reportedly upset