తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నిన్న మొన్నటి వరకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. మళ్లీ విజృంభించేందుకు సిద్ధమయ్యానని ప్రకటించారు. ఇక, ప్రజల్లోనే ఉంటానని.. రెండేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చానని చెప్పారు. ఈ క్రమంలో ప్రజల మధ్యకు రానున్నట్టు వెల్లడించారు. బహిరంగ సభలతోపాటు.. నిరసనలు, ఉద్యమాలకు తెరదీస్తా నని చెప్పారు. వాస్తవానికి రాజకీయాల్లో ఉన్నవారికి ఈ స్వేచ్ఛ ఉంటుంది. కాదనలేం.
కానీ.. ఇక్కడే మౌలిక ప్రశ్న తెరమీదికి వస్తుంది. పది సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలిన ముఖ్యమంత్రి.. ఇంకా పాత సమస్యలే కొనసాగుతున్నాయని చెప్పడం.. ఆ తప్పులు.. రెండేళ్లలోనే కాంగ్రెస్ సరిచేయలేదని నెపం నెట్టడం వంటివే చర్చకు వస్తున్నాయి. వాస్తవానికి పదేళ్ల ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాష్ట్రానికి ఏం చేశారు? అనేది ప్రశ్న. కాళేశ్వరం, కొత్త సచివాలయం తప్ప.. కళ్ల ముందు ఏమీ కనిపించడం లేదనేది కాంగ్రెస్ నాయకుల వాదన. వీటిలో కాళేశ్వరం అవినీతిలో కూరుకుపోయిందని పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది.
ఇక, ఇప్పుడు పాత సమస్యలను భుజాన వేసుకుని ఉద్యమాలకు రెడీ అయ్యారు. అయితే.. ఇదేసమయంలో సీఎం రేవంత్ రెడ్డి చక్కటి సలహా ఇచ్చారు. రోడ్ల మీద కాదు.. అసెంబ్లలో తేల్చుకుందాం.. సభకు రావాలని కేసీఆర్‌కు పిలుపునిచ్చారు. నిజమే.. అసెంబ్లీలో బీఆర్ ఎస్ పక్ష నాయకుడిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్.. సభకు వెళ్లి మాట్లాడడమే సబబు. ఎందుకంటే.. విస్తృత ప్రజా ప్రయోజనానికి.. ప్రజల గళం వినిపించేందుకు ఉన్న ప్రధాన వేదిక అసెంబ్లీ. పైగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా కావడంతో సీఎం ఎంత సేపు మాట్లాడితే.. అంత సమయం ఆయనకు కూడా దక్కుతుంది.
ఇక, ఆధారాలు.. గత మంచి-చెడులను కూడా కేసీఆర్ సభా ముఖంగానే `కడిగి`పారేయొచ్చు. మరి ఇంత చక్కని అవకాశం వదులుకుని.. నిన్న మొన్నటి నాయకుడిగా.. నిన్న మొన్నటి పార్టీగా వ్యవహరించడం ఏంటి? అనేది ప్రశ్న. ఇదే.. ఇప్పుడు తెలంగాణ సమాజంలో జరుగుతున్న చర్చ. ఇక్కడ కేసీఆర్‌కు కావాల్సింది.. తక్షణ లబ్ధి. బీఆర్ ఎస్ ప్రస్తావన తగ్గిపోయిన దరిమిలా.. ప్రజల్లో చర్చ పెట్టేందుకు నిరసనలు, ధర్నాలు వంటి పాత పద్ధతులను ఆయన ఎంచుకుంటున్నారని పరిశీలకులు భావిస్తున్నారు కానీ, అలా కాకుండా.. రేవంత్ రెడ్డి చెప్పినట్టు.. ఆయన సభకు వెళ్లడమే సముచితమని అంటున్నారు.