వైసీపీ అధినేత జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ నెల 21న వైసీపీ నాయకులు, కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించిన విషయం తెలిసిందే. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో కొందరు కార్యకర్తలు, నాయకులు.. జగన్ ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేశారు.
గొర్రెలు, పొట్టేళ్లను నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే.. వికృతంగా తలలు నరికి.. ఆయా మూగజీవాల కళేబరాల నుంచి ఉబికి వచ్చిన రక్తంతో జగన్ ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేసి.. పైశాచిక ఆనందం పొందారు.
పైగా.. ఆయా ఘటనలను వీడియోలు, ఫొటోలు తీసి.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ పరిణామాలపై స్థానికంగా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అడవుల్లో జంతువుల మాదిరిగా వ్యవహరించారంటూ.. పలువురు స్థానికులు వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు.
అయినా.. ఆయా ఘటనలను వైసీపీ నాయకులు సమర్థించుకున్నారు. ఇక, పార్టీ కార్యాలయం కానీ, పార్టీ అధినేత జగన్ కానీ.. ఆయా ఘటనలకు సంబంధించి స్పందించలేదు. మరోవైపు.. ఈ వికృత పరిణామాలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం చర్యలకు ఆదేశించింది.
మరోవైపు.. జంతు బలులు, రక్తాభిషేకాలు జరిగిన ప్రాంతాల్లోని ప్రజలు కూడా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో తాజాగా మంగళవారం ఉదయం ఆయా ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఘటనలకు బాధ్యులైన ఆరుగురు వైసీపీ నాయకులు, 15 మందికి పైగా కార్యకర్తలను అరెస్టు చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. సమాజాన్ని భయపెట్టడం, సాధారణ ప్రజలను భయకంపితులను చేయడం, జంతు బలుల నిషేధ చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు చెప్పారు.