స్టేజ్ మీద మాట తూలడం.. ఆ తర్వాత క్షమాపణ చెప్పడం.. ఈ మధ్య సినీ ప్రముఖులలో పలువురి విషయంలో ఇదే జరిగింది. ఈ జాబితాలోకి సీనియర్ నటుడు శివాజీ కూడా చేరాడు. సోమవారం తాను ముఖ్య పాత్ర పోషించిన దండోరా సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో శివాజీ.. మహిళల వస్త్రధారణ గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. గ్లామర్ విషయంలో హద్దులు దాటొద్దని చెబుతూ.. నిండైన దుస్తులు ధరించాలని హీరోయిన్లకు ఆయన సూచించారు.
అంతటితో ఆగకుండా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. “మీ అందం చీరలోనో.. మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనో ఉంటాది తప్పితే సామాన్లు కనపడేదాంట్లో ఉండదమ్మా”.. ‘‘దరిద్రం ముండ..ఇలాంటి బట్టలేసుకున్నావు ఎందుకు.. కొంచెం మంచి బట్టలేసుకుంటే బావుంటావు కదా అని అనాలనిపిస్తుంది లోపల. అనలేం’’.
ఈ రెండు కామెంట్ల పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. చిన్మయి, అనసూయ లాంటి సెలబ్రెటీలతో పాటు సామాన్య నెటిజన్లూ ఆయన తీరును తప్పుబట్టారు. శివాజీ వ్యాఖ్యలను తప్పుబడుతూ.. ఆయన తరఫున మంచు మనోజ్ క్షమాపణలు చెప్పాడు.
ఈ వివాదం పెద్దది అవుతుండడంతో శివాజీ క్షమాపణ చెప్పడం ఖాయం అనే అభిప్రాలు వ్యక్తం అయ్యాయి. శివాజీ కుడా ఎక్కువ టైమ్ తీసుకోకుండా క్షమాపణ వీడియో రిలీజ్ చేసేశారు. తన వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణ చెప్పారు. ఇటీవల కాలంలో హీరోయిన్లు బయటికి వెళ్తే జనం మీద పడి వారు ఇబ్బందుల పాలవుతున్న నేపథ్యంలోనే తాను దండోరా ఈవెంట్లో కామెంట్లు చేసినట్లు శివాజీ తెలిపారు.
తాను మంచి ఉద్దేశంతో.. మహిళలు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతోనే మాట్లాడానని.. కానీ ఈ క్రమంలో రెండు తప్పు మాటలు వాడానని శివాజీ చెప్పాడు. ఆ రెండు మాటల విషయంలో హీరోయిన్లకే కాదు, మహిళలు అందిరికీ తాను చిత్తశుద్ధితో క్షమాపణలు చెబుతున్నానని శివాజీ పేర్కొన్నారు.
స్త్రీలంటే తనకు ఎంతో గౌరవమని.. వారిని కించపరిచే ఉద్దేశమే తనకు లేదని శివాజీ స్పష్టం చేశారు. ఇండస్ట్రీలో ఉన్న మహిళలతో పాటు బయటి వాళ్లు కూడా తన వ్యాఖ్యలతో బాధ పడ్డారని తనకు అర్థమైందని.. అందుకే తాను క్షమాపణ చెబుతున్నానని శివాజీ తెలిపారు. తాను మంచి చెప్పాలని చూశానని.. కానీ ఆ క్రమంలో రెండు పదాలు తప్పుగా వాడానని.. తనకు వేరే ఉద్దేశం ఏమీ లేదని శివాజీ స్పష్టం చేశారు.
I sincerely apologise for my words during the Dhandoraa pre-release event last night.@itsmaatelugu pic.twitter.com/8zDPaClqWT— Sivaji (@ActorSivaji) December 23, 2025