hyderabadupdates.com movies బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్… కేటీఆర్ ఎందుకు లేరు?

బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్… కేటీఆర్ ఎందుకు లేరు?

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల స‌మావేశాలు ప్రారంభ‌మైన నేప‌థ్యంలో ఆ పార్టీ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుతం అసెంబ్లీ బీఆర్ ఎస్ ఫ్లోర్ లీడ‌ర్‌గా కేసీఆర్ ఉన్నారు. అంటే.. స‌భ‌లో ప్ర‌తిప‌క్షం త‌ర‌ఫున చ‌ర్చించే అంశాల‌కు ఆయ‌న అనుమ‌తి ఉంటుంది. ఆయ‌న చెప్పిన‌ట్టుగానే స‌భ్యులు వ్య‌వ‌హ‌రించాలి.

అయితే.. డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ల‌ను నియ‌మించాల‌ని కొన్నాళ్లుగా స‌భ్యుల నుంచి డిమాండ్లు వ‌స్తున్నాయి. కానీ.. కేసీఆర్ మౌనంగా ఉంటున్నారు. ప్ర‌స్తుతం స‌భ‌కు ఆయ‌న‌కు వ‌చ్చే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో తాజాగా డిప్యూటీ లీడ‌ర్ల వ్య‌వ‌హారంపై నిర్ణ‌యం తీసుకున్నారు.

డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్లుగా.. సీనియ‌ర్ల‌ను ఎంపిక చేశారు. వీరిలో మేన‌ల్లుడు హ‌రీష్‌రావు(సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి), స‌బితా ఇంద్రారెడ్డి(మ‌హేశ్వ‌రం ఎమ్మెల్యే, మాజీ మంత్రి), త‌ల‌సాని శ్రీనివాస‌యాదవ్‌(స‌న‌త్‌న‌గ‌ర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి)ల‌కు అవ‌కాశం క‌ల్పించారు. వీరు ఇక నుంచి కీల‌క అంశాల‌పై స‌భ‌లో చ‌ర్చించ‌నున్నారు. అదేస‌మ‌యంలో ఇత‌ర స‌భ్యుల‌ను కూడా ముందుకు న‌డిపించేందుకు బాధ్య‌త తీసుకుంటారు.

ఒక‌ర‌కంగా.. బీఆర్ ఎస్ అధినేత చెప్పిన మేర‌కు వీరు స‌భ‌లో పార్టీ స‌భ్యుల‌ను క‌లుపు కొని ముందుకు సాగ‌నున్నారు. అయితే.. ఈ క‌మిటీలో కేసీఆర్ త‌న కుమారుడు, మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు అవ‌కాశం ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

అదేవిధంగా శాస‌న మండ‌లిలోనూ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ల‌ను కేసీఆర్ నియ‌మించారు. ఎల్‌. ర‌మ‌ణ‌, పోచంప‌ల్లి శ్రీనివాస‌రెడ్డిల‌ను శాస‌న మండ‌లిలో డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్లుగా ఎంపిక చేశారు. ఇదేస‌మ‌యంలో బీఆర్ ఎస్ త‌ర‌ఫున విప్‌గా దేశ‌ప‌తి శ్రీనివాస్‌ను కేసీఆర్ నియ‌మించారు. ప్ర‌స్తుతం మండ‌లిలో బ‌ల‌మైన మ‌ద్ద‌తు ఉండ‌డంతో .. ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేయాల‌న్న‌ది కేసీఆర్ వ్యూహం. ఈ క్ర‌మంలోనే మండ‌లిలోనూ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ల‌ను ఎంపిక చేశారు. వీరు కూడా కేసీఆర్ ఆదేశాల మేర‌కు మండ‌లిలో బ‌ల‌మైన గ‌ళం వినిపించ‌నున్నారు.

Related Post