కేవలం ఆరు వందల రూపాయలు.. అతనిని ఏడాది పాటు జైలుకి పంపింది. ఆదాయపు పన్ను రిఫండ్ ప్రాసెస్ చేయడానికి రూ.600 లంచం తీసుకున్న ఆదాయపు పన్ను శాఖ ఉద్యోగికి పట్నా హైకోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ కేసు 2011లో వెలుగులోకి వచ్చింది.
పన్ను రిఫండ్ కోసం కార్యాలయానికి వచ్చిన వ్యక్తిని ఆదాయపు పన్ను శాఖలో పనిచేస్తున్న ‘ఇన్‌కమ్ ట్యాక్స్ అసిస్టెంట్’ రూ.600 లంచం ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు సీబీఐ విచారణలో తేలింది. బాధితుడి ఫిర్యాదుతో సీబీఐ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. దీనిని కోర్టు కీలక ఆధారంగా పరిగణించింది. రెండు రోజుల కిందట తీర్పును వెలువరించింది.
ఫోరెన్సిక్ నిపుణుల నివేదికలు, కార్యాలయంలోని సిబ్బంది వాంగ్మూలాలు సహా మొత్తం 12 మంది సాక్షుల ఆధారాలతో నేరం నిరూపితమైంది. సీబీఐ అధికారుల వాంగ్మూలం కూడా విచారణలో నిలకడగా ఉందని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో మిగిలిన జైలు శిక్షను అనుభవించేందుకు నిందితుడు వెంటనే లొంగిపోవాలని పట్నా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.