దేశవ్యాప్తంగా వీధికుక్కల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసిన ధర్మాసనం, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ప్రభావవంతమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వీధికుక్కల దాడుల కారణంగా ప్రాణనష్టం జరుగుతున్నా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయంటూ కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
“కుక్కల కంటే మనుషుల ప్రాణాలకు విలువ లేదా?” అంటూ ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వీధికుక్కల దాడుల్లో ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు బాధితులవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసిన కోర్టు, ప్రజా భద్రత విషయంలో ప్రభుత్వాల జవాబుదారీతనంపై కీలక ప్రశ్నలు లేవనెత్తింది. కుక్కల దాడులతో ప్రాణాలు పోతున్నా కళ్లుమూసుకుని కూర్చోవాలా అని వ్యాఖ్యానించింది.
వీధికుక్కల సమస్యను నియంత్రించడంలో విఫలమైతే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలపై భారీ జరిమానాలు విధిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ప్రతి కుక్క కాటు బాధితుడికి తప్పనిసరిగా పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
అలాగే ఈ అంశంలో జంతు ప్రేమికులు, వీధికుక్కలకు ఆహారం పెట్టేవారి పాత్రపైనా కోర్టు అసహనం వ్యక్తం చేసింది. మానవ ప్రాణాలు, జంతువుల సంరక్షణ మధ్య సమతుల్యత పాటిస్తూ శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్రాలు వెంటనే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేసింది.