తిరుపతి జిల్లాకు సీఎం చంద్రబాబు భారీ ప్రాజెక్టు ప్రకటించారు. తిరుపతి తలరాత మార్చేలా.. ఏపీ-ఫస్ట్ పథకాన్ని ఆయన ఎనౌన్స్ చేశారు. ఏపీ-ఫస్ట్.. అంటే.. ఇది సాంకేతిక, పరిశోధన సంస్థ. దీనిని తిరుపతిలో ఏర్పాటు చేయనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు.
ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలోని యువతకు మెరుగైన సౌకర్యాలతోపాటు ఉన్నత విద్య, కీలకమైన ఏరో స్పేస్ రంగంలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. అంతేకాదు.. రానున్న 50 ఏళ్లలో దేశంలో జరిగే మార్పులకు అనుగుణంగా ఏయే రంగాల్లో వృద్ధి కనిపిస్తుందో.. ఆయా రంగాల దిశగా యువతను ప్రోత్సహించనున్నట్టు ఆయన వివరించారు.
మూడు రోజుల సంక్రాంతి సంబరాలను ముగించుకుని శుక్రవారం మధ్యాహ్నం ఉండవల్లికి చేరుకున్న ముఖ్యమంత్రి ఆ వెంటనే.. ఏరో స్పేస్-డిఫెన్స్, ఐటీ-డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సలహదారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న పలు రంగాలకు సంబంధించిన విషయాలపై వారితో చర్చించారు.
ఏపీ-ఫస్ట్ పేరుతో తిరుపతి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా యువతకు పలు రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ముఖ్యంగా పరిశోధనలు, సాంకేతిక రంగాలకు సంబంధించిన విషయాల్లో శిక్షణ ఇస్తారు.
AP-FIRST అంటే..
AP- ఆంధ్రప్రదేశ్
F – ఫ్యూచరిస్టిక్
I – ఇన్నోవేషన్
R – రిసెర్చ్
S – సైన్స్
T – టెక్నాలజీ
ఏయే రంగాల్లో ఉపాధి?
ఏపీ -ఫస్ట్ ద్వారా పలు కీలక శాస్త్ర సాంకేతిక రంగాల్లో యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. అదేసమయంలో పరిశోధనలకు కూడా అవకాశం కల్పించనున్నారు. అవి..
1) ఏరో స్పేస్
2) రక్షణ రంగం
3) అంతరిక్ష సాంకేతికత
4) ఏఐ-సైబర్ భద్రత
5) సెమీ కండక్టర్ల డివైజెస్-సెన్సర్లు
6) క్వాంటమ్ టెక్నాలజీ
7) హెల్త్ కేర్
8) బయో టెక్నాలజీ
9) గ్రీన్ ఎనర్జీ
10 గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి సాంకేతికత