మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి ఎవరితో చేస్తాడనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో విపరీతంగా ఉంది. అతను ఊ అనాలే కానీ కోట్లలో అడ్వాన్స్ ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అయితే వెంకటేష్ తోనే మరో సినిమాకు అనిల్ సానుకూలంగా ఉన్నట్టు విశ్వసనీయమైన సమాచారం ఉంది.
సంక్రాంతికి వస్తున్నాంకి సీక్వెలా లేదా ఏదైనా ఫ్రెష్ సబ్జెక్టుతో దిగుతారా అనేది ఇంకొన్ని వారాలు ఆగితే క్లారిటీ వస్తుంది. నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కలయికలో ఎఫ్2, ఎఫ్3, సంక్రాంతికి వస్తున్నాం మొత్తం మూడు చిత్రాలొస్తే అన్నీ విజయం సాధించాయి.
మెగా మూవీ క్యామియో పక్కనపెడితే వెంకీ అనిల్ కలయికలో ఇది నాలుగో సినిమా అవుతుంది. అభిమానులు మాత్రం కొత్త కథతో రమ్మని కోరుతున్నారు. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ శంకరవరప్రసాద్ రికార్డులను బ్రేక్ చేయడమే. దానికి మంచి పవర్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఆశిస్తున్నారు.
నిజానికి సంక్రాంతికి వస్తున్నాం బాహుబలి, కెజిఎఫ్, పుష్ప లాగా సీక్వెల్ క్రేజ్ ఉన్న సినిమా కాదు. అందుకే డిఫరెంట్ గా ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది. అనిల్ మాత్రం పోస్ట్ రిలీజ్ ఇంటర్వ్యూలలో ఎక్కడా తన నెక్స్ట్ ప్రాజెక్టు గురించి బయట పడటం లేదు. త్వరలో వివరాలు చెబుతా అంటున్నారు తప్పించి క్లారిటీ ఇవ్వడం లేదు.
రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ తర్వాత అంత డిమాండ్ ఉన్న డైరెక్టర్ల లిస్టులో అనిల్ రావిపూడి చోటు సంపాదించుకున్నాడు. బడ్జెట్లు తక్కువ అయినా సరే కలెక్షన్లకు కొదవ లేదన్న రీతిలో బాక్సాఫీస్ తో ఆడుకుంటున్న తీరు మార్కెట్ ని అంతకంతా పెంచేస్తోంది.
ప్రస్తుతం ఆదర్శ కుటుంబం చేస్తున్న వెంకటేష్ ఆ తర్వాత అనిల్ కనక ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తే దానికి డేట్లు ఇచ్చేందుకు రెడీగా ఉన్నారట. దీని కోసం దృశ్యం 3 రీమేక్ ని త్యాగం చేయడానికి వెనుకాడబోరని ఇన్ సైడ్ టాక్. అదే నిజమైతే వెంకీతో తక్కువ సమయంలో ఇన్నిసార్లు కొలాబరేట్ అయిన దర్శకుడు అనిల్ రావిపూడి స్థానం ప్రత్యేకం అవుతుంది.