దేవుడు, భక్తితో ముడిపడ్డ విషయాల్లో లైన్ దాటితే తీవ్ర వివాదాలు తప్పవు. కొన్ని నెలల కిందట తిరుమలలో ప్రసాదం గురించి నోరు జారిన యాంకర్ శివజ్యోతి ఎంత వ్యతిరేకతను ఎదుర్కొందో తెలిసిందే. క్షమాపణలు చెప్పాక కూడా ఆమె మీద వ్యతిరేకత తగ్గలేదు. తాజాగా యువ నటి టీనా శ్రావ్య ఇలాంటి వివాదంలోనే చిక్కుకుంది.
మేడారం జాతరలో ఆలయం దగ్గర పిల్లల బరువును బట్టి బెల్లాన్ని మొక్కుగా చెల్లించడం ఆనవాయితీ. ఐతే టీనా మాత్రం తన పెంపుడు కుక్కను తూకం వేసి ఆ మేరకు బెల్లాన్ని ఆలయానికి సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. దీని మీద తీవ్ర దుమారమే రేగింది.
కుక్కను పెట్టి మొక్కు చెల్లించుకోవడం ఏంటి.. ఇది భక్తుల మనోభావాలను దెబ్బ తీసేదే అనే విమర్శలు వచ్చాయి. ఆలయ నిర్వాహకులు దీనికి ఎలా అనుమతించారనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ పనికి ఆమె క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి.
వివాదం పెద్దది కాకుండా టీనా శ్రావ్య త్వరగానే క్షమాపణలు చెప్పేసింది. తాను పెంచుకున్న కుక్కకు 12 ఏళ్లని.. దానికి ట్యూమర్ సర్జరీ అయిందని.. అది బాగా కోలుకోవాలన్న ఉద్దేశంతోనే సమ్మక్కకు మొక్కుకున్నానని.. అనుకున్నట్లుగానే కుక్క కోలుకోవడంతో మొక్కు చెల్లించడానికి వెళ్లానని.. కుక్క కోసం మొక్కుకున్నా కాబట్టే దాంతో సమానంగా బెల్లం తూకం వేయించానని.. అది తాను భక్తితో, ప్రేమతో చేశా తప్పితే ఎవరినీ కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదని టీనా శ్రావ్య స్పష్టం చేసింది.
ఐతే మేడారం జాతర సంప్రదాయం, గిరిజనుల ఆచారాం ప్రకారం అలా చేయడం తప్పని తాను తెలుసుకున్నానని.. తాను చేసిన పొరపాటు వల్ల ఎవరైనా బాధ పడి ఉంటే తనను క్షమించాలని.. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడూ జరగనివ్వనని ఆమె స్పష్టం చేసింది. సంప్రదాయాలను తాను ఎప్పుడూ గౌరవిస్తానని.. ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని కోరుతున్నానంటూ ఆమె చేతులెత్తి వేడుకుంది. టీనా క్షమాపణతో ఈ వివాదం ముగిసినట్లే భావించాలి.