హైదరాబాద్ : సరూర్‌నగర్ చెరువును పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు హైడ్రా చర్యలు తీసుకుంటుందని కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. ప్రభుత్వ అనుమతులతో త్వరలోనే పనులు చేపడతామని చెప్పారు. 140 ఎకరాలకు పైగా ఉన్న చెరువు పరిధిలో చాలా వరకు నివాసాలు వచ్చేశాయన్నారు. ఇప్పుడు వాటి జోలికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. ఇంకా 90 ఎకరాలకు పైగా మిగిలి ఉన్న చెరువునే అభివృద్ధి చేస్తామని చెప్పారు. నగరంలో పెద్ద చెరువులను కూడా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారని అన్నారు. అందులో సరూర్‌నగర్ చెరువు కూడా ఉందన్నారు. ఈ క్రమంలోనే హైడ్రా కమిషనర్ సరూర్‌నగర్ చెరువును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ చెరువుకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించి.. మార్చిలోగా పనులు చేపడతామన్నారు. ఏడాదిలో పనులు పూర్తి చేస్తామని హైడ్రా కమిషనర్ తెలిపారు.
చెరువుల అభివృద్ధి అంటే పై మెరుగులు దిద్దడం కాదని ఇప్పటికే హైడ్రా పునరుద్ధరించిన బతుకమ్మకుంట, బమృకున్ – ఉద్ -దౌలా, కూకట్‌పల్లి నల్లచెరువులను పరిశీలిస్తే అందరికీ అర్థమౌతుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. ఆ దిశగానే సరూర్‌నగర్ చెరువును తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. చెరువులో 10 నుంచి 15 అడుగుల మేర పూడికను తొలగించి లోతు పెంచుతామన్నారు. పూడికను తొలగించడం ద్వారా నీటి నిలువ సామర్థ్యం పెంచడమే కాకుండా.. భూగర్భ జలాల పెరుగుదలకు మార్గం సుగమం అవుతుందన్నారు. చెరువు ఇన్‌లెట్లు, ఔట్‌లెట్లు సరిగా ఉండేలా చూస్తాం అన్నారు. మరీ ముఖ్యంగా వరదల నియంత్రణకు ఈ చెరువు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతామన్నారు. మురుగు నీరు చెరువులో కలవకుండా వాటర్ బోర్డు సహకారంతో జాగ్రత్తలు తీసుకుంటూనే.. ఎస్‌టీపీల సామర్థ్యాన్నిపెంచుతామన్నారు.
The post సరూర్‌నగర్ చెరువును పునరుద్ధరిస్తాం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
సరూర్‌నగర్ చెరువును పునరుద్ధరిస్తాం
Categories: