రాజకీయాలకు కీలకమైన విజయవాడలో నాయకుల దూకుడు ఓ రేంజ్‌లో ఉంటుంది. ఈ విషయంలో ఎవరికీ సందేహం లేదు. అయితే.. కేవలం మాటలకేనా? పనులకు ఏమైనా ఛాన్స్ ఉంటుందా? అంటే.. ముందు మాటలు.. తర్వాతే పనులు అన్నట్టుగా నాయకులు ఇక్కడ వ్యవహరిస్తూ ఉంటారు. కానీ.. దీనికి భిన్నంగా తొలిసారి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
వాస్తవానికి గత ఎన్నికల్లో తొలిసారి ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పశ్చిమ నియోజకవర్గం అంటేనే ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉంటారు. అలాంటి చోట బీజేపీ రెండో సారి విజయం దక్కించుకుంది. తాజా విజయం తర్వాత.. బీజేపీ వెనక్కి తిరిగి చూసుకోకుండా.. వ్యవహరించేలా ఎమ్మెల్యే సుజనా కార్యాచరణ చేస్తున్నారు. స్థానికంగా ఉన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరిస్తూ.. ఆయన తొలి నాళ్లలోనే ఇక్కడివారిని ఆకట్టుకున్నారు.
ఇక, ఇప్పుడు మొబైల్ ఆసుపత్రిని ఆయన అందుబాటులోకి తీసుకువచ్చారు. పశ్చిమ నియోజకవర్గంలో కొండ ప్రాంతాలు ఎక్కువ. ఇక్కడి వారికి ఏ చిన్న వైద్య అవసరం వచ్చినా.. కిలో మీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇంటి ముందుకే అధునాతన వైద్యం అందించేలా సుజనా ఫౌండేషన్ సహకారంతో ఎమ్మెల్యే మొబైల్ ఆసుపత్రికి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇది సేవలందించనుంది.
ప్రతి వార్డులోనూ రెండు నుంచి మూడు గంటలపాటు ఈ వాహనాన్ని నిలిపి వుంచుతారు. దీనిలో షుగర్, బీపీ, కిడ్నీ టెస్టుల నుంచి ఇతర మలేరియా జ్వరాలు.. చిన్నపాటి రోగాలను నయం చేసేలా వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచారు. ఈసీజీ కూడా తీస్తారు.
దీనిని ముఖ్యంగా పేదలు, తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి అందుబాటులోకి తీసుకువచ్చినట్టు ఎమ్మెల్యే చెబుతున్నారు. నిజానికి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఇలాంటి ఆలోచన ఎవరూ చేయకపోవడంతో ఎమ్మెల్యే పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.