తమిళనాడులో రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అందరూ హిందీ భాషను బలవంతంగా కేంద్రం తమ ప్రజలపై రుద్దాలని చూస్తోందని విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగనివ్వబోమని తమిళనాడు సీఎం స్టాలిన్ తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే ఇదే విషయాన్ని ఆయన తనయుడు, తమిళనాడు డిప్యూటీ సీఎం, కోలీవుడ్ హీరో ఉదయనిధి స్టాలిన్ మరోసారి స్పష్టం చేశారు.
తమిళనాడుపై హిందీని రుద్దే ప్రయత్నాలను ఒప్పుకునే ప్రసక్తే లేదని ఉదయనిధి స్టాలిన్ చెప్పారు.1960లలో హిందీ వ్యతిరేక ఆందోళనల్లో అమరులైన తమిళులకు ఆయన నివాళులర్పించారు. ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో హిందీని బలవంతంగా రుద్దారని, ఆ క్రమంలోనే హర్యాన్వీ, భోజ్ పురి, బిహారీ, ఛత్తీస్‌గఢీ వంటి మాతృభాషలు ఆయా రాష్ట్రాల్లో కనుమరుగయ్యాయని విమర్శించారు. ప్రాంతీయ గుర్తింపు, సాంస్కృతిక వారసత్వాన్ని హిందీ భాష నాశనం చేస్తుందనేందుకు ఇదే నిదర్శనమని చెప్పారు. తమిళనాడులో ఆ విధంగా జరగనివ్వబోమని తేల్చి చెెప్పారు.
కాగా, బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఉదయనిధి స్టాలిన్ గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. డెంగ్యూ, దోమలు, మలేరియా, కోవిడ్-19 వంటి వాటిని వ్యతిరేకించలేమని, వాటిని నిర్మూలించాలని ఆయన అన్నారు. అదేవిధంగా, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే బదులు, మనం దానిని నిర్మూలించాలని ఉదయనిధి చేసిన కామెంట్లపై హిందూ సంఘాల నేతలు, బీజేపీ నేతలు మండిపడ్డారు. ఆ తర్వాత ఉదయనిధిపై కేసు నమోదైంది.
ఆ క్రమంలోనే ఈ ఏడాది జనవరి 21న ఆ కేసును విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు….ఉదయనిధి చేసిన వివాదాస్పద ప్రకటన ద్వేషపూరిత ప్రసంగమని అంగీకరించింది. ఆ వ్యాఖ్యల నేపథ్యంలో ఉదయనిధి ఇప్పటికే చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరికొద్ది నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ కేసు ఉదయనిధికి చిక్కులు తెచ్చేలా కనిపిస్తోంది.