తిరుమల : టీటీడీలో పాలసీ ఆధారిత పాలన సాగిస్తున్నామని స్పష్టం చేశారు టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ప్రసంగించారు. టీటీడీ కూడా ఒక పురాతన, మహత్తర ధార్మిక సంస్థగా కాలానుగుణంగా తన వ్యవస్థలను పునః పరిశీలిస్తూ, భక్తుల అవసరాలకు అనుగుణంగా సంస్కరణలు చేపడుతోందని చెప్పారు. ఒకటిన్నర సంవత్సరాల్లో టీటీడీలో అన్నప్రసాద విభాగం పాలసీలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. కాటేజ్ డొనేషన్ స్కీమ్ లో సమగ్ర పాలసీ తీసుకు రావడానికి విశేష కృషి చేశామని తెలిపారు. ఇతర పాలసీలను కూడా పటిష్టం చేసేందుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపడతామని అన్నారు.
టీటీడీ కొనుగోళ్ల విభాగానికి సంబంధించి ఉత్పత్తులు, ప్రాసెస్‌లు, అగ్రిమెంట్లు, క్యాన్సిలేషన్, బ్లాక్‌లిస్టింగ్ వంటి అంశాలతో కూడిన సమగ్ర పాలసీ సిద్ధమవుతోందని చెప్పారు. అలాగే అన్ని ప్రొక్యూర్మెంట్ ప్రక్రియలను పోర్టల్ ద్వారా నిర్వహించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. దీంతో పారదర్శకత పెరిగి మానవ జోక్యం గణనీయంగా తగ్గుతుందని అన్నారు. బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి వంటి వరుసగా జరిగిన ఉత్సవాలను లక్షలాది భక్తుల మధ్య అన్ని విభాగాల సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించ గలిగామని తెలిపారు. ప్రతి కార్యక్రమం అనంతరం పునః సమీక్షించడం ద్వారా భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ కృషి చేస్తోందని పేర్కొన్నారు
వాట్సాప్, ఐవీఆర్ఎస్, ఫోన్ కాల్స్, శ్రీవారి సేవకుల ద్వారా భక్తుల నుండి ఎప్పటికప్పుడు అభిప్రాయాలను సేకరిస్తూ సేవల నాణ్యతను నిరంతరం మెరుగు పరుస్తున్నామని తెలిపారు. అన్నప్రసాద సేవల్లో 96–97% మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేయగా, లడ్డూ నాణ్యతపై పూర్తిస్థాయిలో భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. వైకుంఠం–1లో ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా వైకుంఠ ద్వార దర్శన రోజుల్లో సమయాన్ని సమర్థంగా వినియోగించుకుని చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 7.83 లక్షల మందికి దర్శనం కల్పించామని చెప్పారు. తిరుమలలో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిస్‌ప్లే సిస్టమ్ ద్వారా బస్ స్టాప్ ల వద్ద వేచి ఉండే భక్తులకు బస్సులు వచ్చే సమయాన్ని ముందుగానే తెలియజేసేలా ఏర్పాట్లు చేయడంతో భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలిపారు.
తిరుమలలో భక్తుల పాద రక్షలు భద్ర పరచుకునే సమస్యకు పరిష్కారంగా లగేజీ కౌంటర్ల తరహాలో క్యూఆర్ కోడ్ ఆధారిత పాద రక్షల కేంద్రాలను ఏర్పాటు చేయడంతో అద్భుతమైన ఫలితాలు వచ్చాయని చెప్పారు. ప్రతి వ్యవస్థలో పవిత్రత, పారదర్శకత, భక్తుల ప్రయోజనాలే కేంద్రంగా టీటీడీ ముందుకు సాగుతుందని, తిరుమల ఎల్లప్పుడూ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆధ్యాత్మిక కేంద్రంగా నిలవాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
The post టీటీడీలో పాలసీ ఆధారిత పాలన : అడిషనల్ ఈవో appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
టీటీడీలో పాలసీ ఆధారిత పాలన : అడిషనల్ ఈవో
Categories: