hyderabadupdates.com movies చంద్రబాబు ర్యాంకుపై జగన్ సెటైర్లు

చంద్రబాబు ర్యాంకుపై జగన్ సెటైర్లు

కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కూటమి పార్టీల నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 11.75 శాతం వృద్ధి సాధించిందని, 2025-26లో 10.75 శాతం వృద్ధి సాధించబోతున్నామని అంచనా వేస్తూ ప్రభుత్వం ఓ నివేదికను కూడా విడుదల చేసింది. అయితే, ఆ నివేదికను ఏపీ మాజీ సీఎం జగన్ తప్పుబట్టారు. ఈ గణాంకాలు ఏ స్వతంత్ర సంస్థ ఇవ్వలేదని, చంద్రబాబు కార్యాలయంలో సృష్టించినవని ఎద్దేవా చేశారు.

అంతేకాదు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఈ ఆర్థిక సంవత్సరంలోని మొదటి 9 నెలలకు విడుదల చేసిన గణాంకాలను ఉటంకిస్తూ విమర్శలు గుప్పించారు. రెండేళ్లుగా రాష్ట్ర పన్నుల రాబడి వృద్ధి సగటున కేవలం 1.97 శాతం అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 11 శాతం పైగా జీఎస్‌డీపీ వృద్ధి సాధిస్తున్న రాష్ట్రంలో పన్నుల రాబడి 2 శాతం లోపు ఎలా ఉంటుందని జగన్ ప్రశ్నించారు.

ఇక, ఈ వింత గణాంకాలు చూసి ప్రపంచ ఆర్థికవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారని జగన్ సెటైర్లు వేశారు. ఏపీ ప్రభుత్వం చెబుతున్న వృద్ధి నిజమైతే, పన్నుల రాబడిలోనూ ఆ స్థాయి పెరుగుదల ఉండాలని జగన్ అన్నారు. కాగ్ లెక్కలు ప్రభుత్వ బూటకపు ప్రచారాన్ని బట్టబయలు చేశాయని విమర్శించారు.

23 రాష్ట్రాలకు సంబంధించిన పన్నుల రాబడి వృద్ధి జాబితాలో ఏపీ 22వ స్థానంలో నిలిచిందని కాగ్ విడుదల చేసిన గణాంకాలను జగన్ ప్రస్తావించారు. ఆ లిస్ట్ లో ఏపీ అట్టడుగు నుంచి రెండో స్థానంలో నిలవడం సిగ్గుచేటని అన్నారు. ఇదే చంద్రబాబు ’22వ ర్యాంక్ విజన్’ అని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు పాలనలో ఏపీ అప్పులు, అవినీతి, రాజకీయ కక్ష సాధింపులు, తప్పుడు ప్రచారంలో నెంబర్ వన్ గా ఉందని చురకలంటించారు. ఈ వృద్ధి రేటుతో దేశంలోనే మూడో స్థానంలో ఉన్నామని ప్రభుత్వం చెప్పుకోవడం పెద్ద జోక్ అని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, అయినా జీఎస్‌డీపీ గణాంకాలతో ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు.

Related Post