దేశంలోనే తొలిసారిగా.. టీవీ ఛానల్ రేటింగ్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే నాలుగు వారాలు లేదా ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ముగిసే వరకు టీవీ ఛానళ్లకు ఇచ్చే రేటింగ్‌ను నిలుపుదల చేయాలని ఆదేశిస్తూ కేంద్ర ఐటీ, సమాచార మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. టీవీ ఛానళ్లు చేస్తున్న ప్రచారాలతో రేటింగ్ పెంచుకోవాలని చూస్తున్నట్టు పేర్కొంది. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేయడం గమనార్హం.
ఇరాన్ యద్ధ వార్తల ద్వారా అనవసరమైన భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారని.. కేంద్ర ఐటీ, సమాచార మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది. తద్వారా టీవి ఛానళ్ళు టీఆర్ పీ రేటింగును పెంచుకోవాలని చూస్తున్నాయని ఆరోపించింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా టీవీ చానెళ్లకు ఇచ్చే టీఆర్ పీ రేటింగ్స్‌ను.. నాలుగు వారాలు లేక తదుపరి ఉత్తర్వుల వరకు ఇండియాలో… బార్క్ రేటింగ్స్ ను సస్పెండ్ చేస్తున్నట్టు వివరించింది. టెలివిజన్ రేటింగ్స్‌కు సంబంధించి 2014లోనే కొన్ని నిబంధనలు రూపొందించిన విషయాన్ని పేర్కొంది.
వాటిని పదే పదే ఉల్లంఘిస్తే.. చర్యలు తీసుకునేందుకు కేంద్ర ఐటీ, సమాచార మంత్రిత్వ శాఖకు అవకాశం ఉందని తెలిపింది. అత్యంత సున్నితమైన ఇరాన్-అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాన్ని సంచలనం చేస్తూ.. పదే పదే ప్రచారం చేయడం ద్వారా ఆయా ఛానెళ్లు తమ రేటింగ్‌ను పెంచుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఖండిస్తున్నట్టు తెలిపింది.
అంతేకాదు.. అసలు యుద్ధానికి సంబంధించిన వార్తల కంటే.. ఉన్నవీ లేనివీ.. ఊహాగానాలను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారని తద్వారా.. సమాజంలో అశాంతి పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే టీఆర్ పీ రేటింగ్స్‌ను నిలుపుదల చేస్తున్నట్టు వివరించింది.