బిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. ఆషు రెడ్డి. ఐతే ఆ ఫేమ్ ఆమెకు పెద్దగా అవకాశాలు తెచ్చిపెట్టలేకపోయింది. ఆషు రెడ్డి నటించిన సినిమాలు తక్కువే. అందులో కూడా చిన్నా చితకా పాత్రలే చేసింది. ఐతే ఇప్పుడు ఆమెకు విక్రమ్ ఆన్ డ్యూటీ అనే సినిమాలో హీరోయిన్ తరహా పాత్ర దక్కిందట. దీని గురించి ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో చాలా ఎగ్జైట్ అవుతూ మాట్లాడింది ఆషు. తన సొంత తల్లిదడ్రులు తనకు జన్మనిస్తే వీళ్లు తనకు జీవితాన్ని ఇచ్చారంటూ ఆ చిత్ర నిర్మాతలను కొనియాడింది ఆషు.
ఐతే ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ.. ఈ ప్రొడక్షన్ హౌస్ చాలా స్ట్రిక్ట్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సెట్లో, అయినా ఇంట్లో అయినా అణిగి మణిగి ఉండాలని.. లేదంటే సినిమాల నుంచి తీసేస్తారని ఆమె వ్యాఖ్యానించింది. ఆర్టిస్టులు ఎవరైనా ఓవరాక్షన్ చేస్తే తీసేయడానికి వెనుకాడరని ఆమె కామెంట్ చేసింది. ఇంతలో మరో నటి అందుకుని అలాంటిదేమీ లేదని నవ్వుతూ వ్యాఖ్యానించింది.
ఇక ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన కీరవాణి భలే సరదాగా మాట్లాడారు. ఏమైనా హుక్ లైన్స్ చెప్పమని అడిగితే.. పాటలకు హుక్ లైన్స్ ఉంటాయి కానీ, ఈవెంట్లకు ఉండవని ఆయనన్నారు. కానీ తనకు నచ్చని ఒక విషయం చెబుతా అంటూ బయట తనకు కటౌట్లు, ఫ్లెక్సీలు పెట్టడం.. బొకే ఇవ్వడం లాంటివి తనకు ఇష్టం ఉండవని ఆయనన్నారు.
వీటి కోసం డబ్బులు వృథా చేయడం బదులు.. ఆ ఖర్చుతో ఇంట్లో ఉప్మా పెసరట్టు చేసుకుని వస్తే ఒక పట్టు పడతానని.. అవి ఒంటికి కూడా బాగా వంటపడతాయని కీరవాణి అనడంతో అక్కడ నవ్వులు పూశాయి. బిగ్ బాస్ ఫేమ్ నిఖిల్ హీరోగా నటించిన విక్రమ్ ఆన్ డ్యూటీ త్వరలో హాట్ స్టార్‌లో స్ట్రీమ్ కానుంది.