ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్ హీరోయిన్గా కొనసాగింది. ఈ మధ్యే ఆమె కథానాయికగా 20 ఏళ్ల ప్రస్థానాన్ని కూడా పూర్తి చేసుకుంది. ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఉండడం గొప్ప విషయం.
ఐతే కొన్నేళ్లుగా ఆమె ఎక్కువగా ఐటెం సాంగ్స్ చేస్తోంది. వేరే భాషల్లోనే సినిమాలు చేస్తోంది. తెలుగులో అవకాశాలు దాదాపుగా ఆగిపోయాయి. గత ఏడాది ‘ఓదెల-2’ సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది కానీ.. కమర్షియల్ సినిమాల్లో ఛాన్సులు దక్కే పరిస్థితి కనిపించడం లేదు. చివరగా ఆమె మెగాస్టార్ చిరంజీవి సరసన ‘భోళా శంకర్’లో నటించింది. తర్వాత ఏ స్టార్ చిత్రంలోనూ ఛాన్స్ రాలేదు. ఐతే ఇప్పుడు మాస్ రాజా రవితేజ సినిమాలో తమన్నాకు ఓ కీలక పాత్ర దక్కినట్లు సమాచారం.
ఇటీవల మాస్ సినిమాలు మానేసి డిఫరెంట్ మూవీస్ చేస్తున్నాడు రవితేజ. సంక్రాంతికి వచ్చిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఆయన ఇమేజ్‌కు పూర్తి భిన్నమైన మూవీ. దీని తర్వాత ‘ఇరుముడి’ పేరుతో ఒక వెరైటీ మూవీని లైన్లో పెట్టాడు. ఇందులో ఆయన భార్యగా తమిళ నటి ప్రియ భవానీ శంకర్ నటిస్తోంది. ఐతే ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా ఉంటుందట.
కథలో కీలకంగా ఉండే ఆ పాత్రకు తమన్నాను ఎంచుకున్నారట. తమన్నా గతంలో రవితేజతో ‘బెంగాల్ టైగర్’ సినిమాలో నటించింది. అందులో ఆమెది ఫుల్ గ్లామర్ టచ్ ఉన్న పాత్ర. ఈ సారి చేస్తోంది పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్.
నిన్నుకోరి, మజిలీ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ రూపొందిస్తున్న ‘ఇరుముడి’లో రవితేజ అయ్యప్ప మాల వేసే సాధారణ మధ్య తరగతి వ్యక్తిగా కనిపించనున్నాడు. ఇంతకుముందు రవితేజతో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ లాంటి డిజాస్టర్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ‘ఇరుముడి’ని ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది.