దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో అవిశ్వాసం ప్రవేశపెట్టే పరిస్థితి వచ్చింది. తాజాగా లోక్‌సభ స్పీకర్‌పైనా అవిశ్వాసం ప్రవేశ పెట్టారు. అవి వీగిపోయి ఉండొచ్చు. కానీ, ఆయా అవిశ్వాస తీర్మానాల కారణంగా.. ఆయా నాయకుల పై ఎద్ద ఎత్తున చర్చజరిగేందుకు.. వారిపై ఉన్న ఆరోపణలు వెలుగు చూసేందుకు అవకాశం లభించింది.
ఇక, ఈ పరంపరలో.. తాజాగా దేశంలోనే తొలిసారిగా.. కేంద్ర ఎన్నికల కమిషన్.. ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్‌పైనా అభిశంసన తీర్మానం(ఆ పదవి నుంచి తొలగించడం) రెడీ అయింది. దీనిని కూడా ప్రతిపక్షాలే ఉభయ సభల్లో ప్రవేశ పెట్టనున్నాయి. దీనికి సంబంధించిన క్రతువును కాంగ్రెస్ పార్టీ సహా ఇండియా కూటమిలోని పార్టీలు ముందుండి నడిపించాయి. అంతేకాదు.. ఈ తీర్మానం ఉభయ సభల్లో ప్రవేశ పెట్టేందుకు కొన్ని నియమాలు ఉన్నాయి.
ఈ నియమాలను కూడా విపక్షాలు ఇప్పటికే పూర్తి చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానకమిషనర్‌ను తొలగించే ప్రక్రియ పూర్తిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించే ప్రక్రియను పోలి ఉంటుంది. ఈ క్రమంలో లోక్‌సభలో అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టేందుకు 100 మంది ఎంపీల సంతకాలు, రాజ్య సభలో సంతకాలు పెట్టేందుకు 50 మంది సభ్యులు కావాలి. అయితే.. ప్రస్తుత తీర్మాన ప్రతిపై లోక్‌సభలో 120 మంది, రాజ్యసభలో 60 మంది సంతకాలు చేశారు.
ఇక, ఈ తీర్మానాలు సభలకు చేరిన తర్వాత.. సంతకాలు చేసిన వారిలో సగం మంది చేతులు పైకెత్తి మూ జువాణి ఓటు ద్వారా అంగీకారం తెలపాలి. దీంతో లోక్‌సభలో స్పీకర్, రాజ్యసభలో చైర్మన్.. తీర్మానాలను ఆమోదిస్తారు. అనంతరం.. ఒక కమిటీని నియమిస్తారు. ఈ కమిటీలో హైకోర్టు న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి సహా.. న్యాయకోవిదుడు ఉంటారు. వీరు.. అటు జ్ఞానేష్‌కుమార్‌ను, ఇటు తీర్మానానికి సంబంధించిన సాక్షులను విచారించి నివేదికను ఉభయ సభలకు అందిస్తారు. దీనికి గాను 45 రోజుల సమయం పడుతుంది.
అనంతరం.. ఈ నివేదికపై ఉబయ సభల్లోనూ చర్చిస్తారు. ఈ సమయంలో సీఈసీని కూడా సభకు పిలుస్తారు. ఆయన వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పిస్తారు. అనంతరం.. ఆయన తన తప్పు ఒప్పుకొని.. రాజీనామాకు రెడీ అయితే.. సరే. లేకపోతే.. ఉభయ సభల్లో మద్దతు ప్రకారం కమిటీ నివేదికను ఆమోదిస్తారు. దీంతో ఆయన పదవిని కోల్పోతారు.
ఏం చేశారని?
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)ను చేపట్టిన జ్ఞానేష్ కుమార్..పై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమకు అనుకూల ఓటు బ్యాంకును తొలగిస్తూ.. బీజేపీ అనుకూల ఓటు బ్యాంకును పెంచుతున్నారన్నది ప్రధాన ఆరోపణ. సర్ ప్రక్రియ ద్వారా.. రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేందుకు ఈయన బీజేపీకి అనుకూలంగా మారారన్న వాదన ఉంది. పైగా తొలగిస్తున్న ఓటర్ల జాబితాను దాచేయడం.. ఈవీఎంలలో నిక్షిప్తం అయిన ఓట్లను నిర్దేశిత గడవుకంటే ముందే తొలగించడం వంటి ఆరోపణలు ఉన్నాయి.